Rahul Gandhi Vs Amit Shah On OBCs :లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. దేశంలో పరిపాలన విభాగాల్లో ఓబీసీలకు ప్రభుత్వం ఏ మేర ప్రాధాన్యమిస్తుందనే అంశాన్ని లేవనెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దీనికి సమాధానంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాహుల్ ప్రశ్నకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
'90 మందిలో.. కేవలం ముగ్గురేనా..?'
మహిళా రిజర్వేషన్‌పై చర్చ సందర్భంగా కులగణన గురించి ప్రస్తావించిన రాహుల్.. దేశంలో వీలైనంత త్వరగా కుల గణనను చేపట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో పాల్గొన్న ఆయన.. మహిళా బిల్లును సత్వరం ఆమోదించి వెంటనే కులాలవారీగా జనాభా లెక్కల సేకరణచేయాలని కేంద్రాన్ని కోరారు. 'భారత ప్రభుత్వం కింద పనిచేసే 90 మంది కార్యదర్శుల్లో ఓబీసీ సామాజిక వర్గం నుంచి కేవలం ముగ్గురే ఉన్నారన్న విషయం తెలుసుకొని నేను షాక్ అయ్యాను.' అని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
'దేశంలో ఓబీసీలు ఎంతమంది ఉన్నారు? దళితులు ఎంతమంది ఉన్నారు? ఆదివాసీలు ఎంతమంది ఉన్నారో అనే విషయాలకు కుల గణన మాత్రమే సమాధానం చెప్పగలదు. ఈ ప్రభుత్వానికి నేను ఒక సూచన చేస్తున్నాను. ముందు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి. వీలైనంత త్వరగా కుల గణన కూడా చేపట్టండి. త్వరితగతిన మీరు చేసిన కులగణన డేటాను కూడా విడుదల చేయండి. మీరు చేయకుంటే మేమే చేస్తాం.'
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్‌కు అమిత్ షా కౌంటర్!
రాహుల్ వ్యాఖ్యలపై దీటుగా స్పందించారు అమిత్ షా. 'కొందరు దేశాన్ని సెక్రెటరీలు నడిపిస్తారని అనుకుంటారు. కానీ, ఆ పనిని ప్రభుత్వం చేస్తుంది. 85 బీజేపీ ఎంపీలు, 29 మంది మంత్రులు ఓబీసీలే.' అని స్పష్టం చేశారు. ఓబీసీల కోసం మాట్లాడుతున్నామని చెప్పుకునే వారు.. ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిగా ఈ దేశానికి అందించింది బీజేపీనే అనే విషయాన్ని తెలుసుకోవాలి' అని వ్యాఖ్యానించారు. కాగా, మీ హయాంలో ఒక్కరు కూడా ఓబీసీ ప్రధాని కాలేదు. కానీ, ఓబీసీ నుంచి ప్రధానిని చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయే అని షా చెప్పుకొచ్చారు.
ప్రతిపక్షాలకు అదే ఎజెండా!
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. మహిళా సాధికారత అనేది ప్రతిపక్షాలకు రాజకీయ ఎజెండా కావొచ్చేమో గానీ భాజపాకు కాదని అన్నారు. 2024 ఎన్నికల ముగిసిన వెంటనే వచ్చే ప్రభుత్వం జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించి వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రక్రియను ప్రారంభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందిన తర్వాత పార్లమెంటు ఉభయ సభలు, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ అవుతాయని దీంతో మహిళల హక్కుల కోసం సుదీర్ఘంగా జరుగుతున్న పోరాటానికి తెరపడనుంది నారీ శక్తి వందన్ అధినియమ్ 2023 బిల్లుపై లోక్‌సభలో ప్రసంగం సందర్భంగా ఆయన వివరించారు. రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది, దేశం విధివిధానాలను ఈ దేశ కేబినెట్ అనగా ప్రభుత్వం లేదా పార్లమెంటు రూపొందిస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు.