తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ బ్రదర్స్ మీటింగ్​తో యూపీ రాజకీయం మారేనా? కాంగ్రెస్​లో ఇన్​సైడ్ టాక్ ఇలా! - రాహుల్ వరుణ్​ గాంధీ కలయిక

Rahul Gandhi Varun Gandhi Kedarnath : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్​ గాంధీ కేదార్‌నాథ్‌లో కలుసుకోవడం ఉత్తర్​ప్రదేశ్​ రాజకీయాలపై చర్చకు దారి తీసింది. వరుణ్ ఇప్పటికే అనేక సార్లు పార్టీ మారుతారన్న వార్తలకు వీరిద్దరి కలయిక మరింత ఆజ్యం పోసింది. ఈ పరిణామంతో ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయం ఏమైనా మారుతోందా అన్న చర్చ ఊపందుకుంది.

rahul gandhi varun gandhi kedarnath
rahul gandhi varun gandhi kedarnath

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 7:15 PM IST

Rahul Gandhi Varun Gandhi Kedarnath : గాంధీ కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే బీజేపీకీ దూరంగా ఉంటున్న వరుణ్ గాంధీ.. రాహుల్​ గాంధీని కలవడం వల్ల యూపీ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. వరుణ్​ గాంధీ కాంగ్రెస్​లోకి వస్తారని అనేక సార్లు వార్తలు రాగా.. ఈ భేటీతో అవి మరోసారి ఊపందుకున్నాయి. అయితే, వరుణ్ గాంధీ కాంగ్రెస్​ పార్టీలోకి చేరతారన్న వార్తలతో పాటు టీఎంసీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు కూడా వస్తున్నాయి.

మరోవైపు వీరిద్దరి కలయికపై స్పందించిన కాంగ్రెస్​ నేతలు.. వరుణ్ గాంధీ, ఆయన తల్లి మేనకా గాంధీని పార్టీ​లోకి తీసుకోవడంపై సోనియా, రాహుల్ గాంధీనే నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ప్రస్తుతం వరుణ్​ గాంధీ పీలీభీత్​ ఎంపీగా ఉండగా.. మేనకా గాంధీ సుల్తాన్​పుర్​ ఎంపీగా కొనసాగుతున్నారు. కేదార్‌నాథ్‌​ పర్యటనలో ఉన్న కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మంగళవారం అనుకోకుండా కలుసుకున్నారు.

కేదార్‌నాథ్‌ పర్యటనలో రాహుల్​ గాంధీ
కేదార్‌నాథ్‌ పర్యటనలో వరుణ్​ గాంధీ

"నాకు తెలిసి ఇది అనుకోకుండా జరిగిన ఓ సమావేశం. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.. కానీ, వీరిద్దరూ కలిసి మాట్లాడుకోవాలనుకుంటే మరో ప్రదేశాన్ని ఎంచుకునేవారు. మతపరమైన ప్రదేశాలు కాకుండా వేరే ప్రాంతాల్లో కూర్చుని మాట్లాడుకునేవారు. వరుణ్​ బీజేపీకి వ్యతిరేక వైఖరి తీసుకోవడం వల్లే ఈ ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన చేరికపై నిర్ణయం తీసుకునేది గాంధీ కుటుంబం మాత్రమే."
--పీఎల్​ పూనియా, కాంగ్రెస్​ నేత

మరోవైపు కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవాలంటే కీలకమైన ఉత్తర్​ప్రదేశ్​లో సత్తా చాటడం తప్పనిసరి అని కాంగ్రెస్​ భావిస్తోంది. అందుకోసమే 80 లోక్​సభ స్థానాలున్న ఉత్తర్​ప్రదేశ్​పై ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2019లో ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్​ కేవలం ఒకే స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన 2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 2 ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలతో అప్రమత్తమైన కాంగ్రెస్​.. కీలకమైన యూపీలో పార్టీని బలోపేతం చేసేందుకు నడుం బిగించింది. తాజాగా మాజీ మంత్రి అజయ్​ రాయ్​ను.. పీసీసీ చీఫ్​గా ప్రకటించింది. దీంతో పాటు ఎస్​పీ, బీఎస్​పీకి చెందిన అనేక మంది నేతలను పార్టీలోకి చేర్చుకుంది.

కేదార్‌నాథ్‌ పర్యటనలో రాహుల్​ గాంధీ

"రాహుల్, వరుణ్ కలుసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. పార్టీ మార్పు వార్తలపై ఆయనే మాట్లాడాలి. భవిష్యత్తు కార్యచరణపై వరుణ్​ స్పందించాలి. మనం ఎందుకు మాట్లాడాలి? మరో గాంధీ కూడా యూపీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం.. ఆయన అధికార కేంద్ర బిందువుగా మారి అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది."
--అఖిలేశ్​ ప్రతాప్​ సింగ్​, కాంగ్రెస్ ఎమ్మెల్యే

అయితే, రెండు గాంధీ కుటుంబాల మధ్య మాత్రం సరైన సంబంధాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్​ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చాలా కాలంగా పరస్పరం దూరంగా ఉంటున్నారు. రాజీవ్‌గాంధీ సోదరుడైన సంజయ్‌గాంధీ కుమారుడు వరుణ్‌ గాంధీ.. రాహుల్‌ కంటే పదేళ్లు చిన్నవారు. అయితే, వరుణ్‌ వివాహం 2011లో జరగగా.. స్వయంగా వరుణ్​ గాంధీ వెళ్లి రాహుల్​ను పెళ్లికి ఆహ్వానించారు. కానీ ఆ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్‌ హాజరుకాలేదు.

కేదార్‌నాథ్‌ పర్యటనలో వరుణ్​ గాంధీ
కేదార్‌నాథ్‌ పర్యటనలో వరుణ్​ గాంధీ కుటుంబం

కార్పొరేట్లకేమో 80% రుణాలు.. యువత, రైతులకు 9 శాతమా?: భాజపా ఎంపీ

'రాహుల్​కు పెళ్లి చేద్దాం.. మంచి అమ్మాయిని చూడండి'.. మహిళా రైతులతో సోనియా గాంధీ

ABOUT THE AUTHOR

...view details