పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షతో పాటు.. పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత వేటుకు గురయ్యారు. అయితే, ఈ కేసు ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. మోదీ ఇంటిపేరును కించపరిచేలా రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గానూ.. 2019లో సూరత్ కోర్టులో గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. అలాగే అదే ఏడాది పట్నా కోర్టులో కూడా రాహుల్‌పై మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో రాహుల్ గాంధీ 2023 ఏప్రిల్ 12న పట్నా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంది. ఈ దావాను బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ వేశారు. రాహుల్ అనర్హత వేటుపై స్పందించిన సుశీల్ కుమార్ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ నిజం మాట్లాడినందుకు ఆయనపై వేటువేశారన్న కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను సుశీల్ కుమార్ మోదీ తిప్పికొట్టారు. కోట్లాది మంది ఓబీసీలను రాహుల్ అవమానించారని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతే కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలు ట్యాప్ చేశారని ఆరోపిస్తారని అన్నారు. రాహుల్ గాంధీ కోర్టు నిర్ణయాన్ని అంగీరించాలని హితవు పలికారు సుశీల్ మోదీ. దేశంలో చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. అవినీతిలో కూరుకుపోయినవారే.. దాని గురించి మాట్లాడుతున్నారని రాహుల్, కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు.
రాహుల్ గాంధీ కంటే ముందు.. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వంటి ప్రముఖులు కూడా అనర్హత వేటుకు గురయ్యారు. ఇదేం కొత్తం విషయం కాదు. చట్టాలకు ఎవరూ అతీతులు కారు. కాంగ్రెస్ పార్టీయే నిజం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో వెనుకబడిన కులాల ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేయవచ్చా?.. వారికి ఉన్నత స్థానాల్లో ఉండే హక్కు రాజ్యాంగం కల్పించలేదా?. ప్రధాని మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. అయినప్పటికీ క్షమాపణలు చెప్పకపోవడం రాహుల్ అహంకారానికి పరాకాష్ఠ. ఓబీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీ.. ప్రధాని కావడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నాయి.