Rahul Gandhi Speech at Nampally Corner Meeting : ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందటం బీజేపీ విధానమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ వ్యాప్తి చేసిన విద్వేషాన్ని భారత్ జోడో యాత్ర సమయంలో చూశానని తెలిపారు. భారతీయ జనతా పార్టీని ప్రశ్నించినందుకు తనపై 24 కేసులు పెట్టారన్న ఆయన.. దిల్లీలో ఎంపీల నివాసం నుంచి తనను వెళ్లగొట్టారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఎంపీ నివాసం నుంచి తనను వెళ్లగొట్టినా బాధపడలేదని.. దేశ ప్రజలందరి గుండెల్లో తనకు ఇల్లు ఉందని బయటికి వచ్చానని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ఆయన పాల్గొని మాట్లాడారు.
Rahul Gandhi Election Campaign in Hyderabad : ఈ సందర్భంగా తనపై 24 కేసులు పెట్టిన బీజేపీ.. అవినీతిపరుడైన కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా పెట్టలేదని రాహుల్ విమర్శించారు. మోదీ సర్కార్ తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందని.. ఆ అవినీతి వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మళ్లీ దొరల సర్కార్ వస్తుందన్న ఆయన.. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజల సర్కార్ వస్తుందని హామీ ఇచ్చారు.
నిరుద్యోగుల బాధను తగ్గించడంలో మా ఉద్యోగ క్యాలెండర్ తొలి అడుగు: రాహుల్ గాంధీ
ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు మెట్రో రైలు ప్రాజెక్టు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వమని రాహుల్ తెలిపారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చింది తమ పార్టీ అని.. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేసిందీ హస్తం పార్టీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారంలోకి వస్తే పేదల నుంచి కేసీఆర్ దోచుకున్న ప్రతి రూపాయి వసూలు చేసి మళ్లీ పేదల జేబులో వేస్తామని పేర్కొన్నారు. గ్యాస్ సిలిండర్‌ను రూ.400కే ఇస్తామని.. రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామన్నారు. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న రాహుల్.. మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.2500 వేస్తామని చెప్పారు.