Rahul Gandhi on farmers protest: నూతన సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలు తమ వద్ద లేవని, పరిహారం ఇవ్వలేమని పార్లమెంట్లో కేంద్రం ప్రకటించటాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. స్వయంగా ప్రధానమంత్రి తప్పు చేసినట్లు ఒప్పుకుని, దేశానికి క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. ఆ తప్పు వల్ల 700 మంది చనిపోయారని, ఇప్పుడు వారి వివరాలపై అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.
"రైతుల ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించటంపై పార్లమెంట్లో ప్రశ్నించారు. దానికి వ్యవసాయ శాఖ వద్ద రైతుల మరణాలపై ఎలాంటి సమాచారం లేదని, అందువల్ల పరిహారం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్రం సమాధానమిచ్చింది. పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందించిన వారు 403 మంది ఉన్నారు. 152 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి 100 మంది జాబితా ఉంది. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు 200 మంది పేర్లతో తయారు చేసిన మూడో జాబితా ఉంది. కానీ, ప్రభుత్వం అలాంటి జాబితానే లేదని చెబుతోంది."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత