Rahul Gandhi Punjab: పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ కార్యకర్తలే నిర్ణయిస్తారని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. పంజాబ్‌లో పర్యటించారు రాహుల్. ఈ సందర్భంగా జలంధర్‌లో 'నవీ సోచ్ నవా పంజాబ్' పేరుతో నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో మాట్లాడారు.
"కాంగ్రెస్ కార్యకర్తలు కోరుకుంటే.. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకుంటాం. కార్యకర్తలను సంప్రదించిన తర్వాతే సీఎం అభ్యర్థిపై వస్తున్న డిమాండ్ నెరవేరుతుంది. మహిళల కోసం ప్రత్యేకమైన మేనిఫెస్టో సిద్ధం చేయాలని సీఎం చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూకు చెప్పాను. పంజాబ్‌లో ఎవరు ముఖ్యమంత్రి అయినా.. మరో వ్యక్తి ఆయనకు మద్ధతు ఇస్తామని సీఎం చన్నీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధూ నాకు మాట ఇచ్చారు. సీఎం అభ్యర్థిని పార్టీ కార్యకర్తలు నిర్ణయిస్తారు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.
చన్నీ, సిద్ధూల ఆలింగనం..
పంజాబ్ కాంగ్రెస్‌లో విభేదాలున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇవాళ ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాహుల్‌గాంధీ పర్యటనలో భాగంగా నిర్వహించిన సభలో మాట్లాడిన.. ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ వేదికపై ఉండగానే పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పిలిచి, చన్నీ ఆలింగనం చేసుకున్నారు. సిద్ధూకు తనకు ఎలాంటి మనస్పర్ధలు లేవని, పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా ఐక్యంగా నిలబడి పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
స్వర్ణ దేవాలయాన్ని దర్శించిన రాహుల్..