Rahul Gandhi Ahmedabad : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో హామీల వర్షం కురిపించారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న వంటగ్యాస్ సిలిండర్‌ను 500 రూపాయలకే అందిస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. పాల ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.5 సబ్సిడీ ఇస్తామన్నారు. బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నారు.బాలికలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. సాధారణ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.
అహ్మదాబాద్‌లో పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఈ హామీలు గుప్పించారు. అధికారంలోకి వస్తే 10 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని చెప్పారు. 3 వేల ఆంగ్ల మాద్యమ పాఠశాలలు నిర్మిస్తామని.. బాలికలకు ఉచిత విద్య అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. "భాజపా ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు మాత్రమే రుణమాఫీ చేస్తుంది. రైతులకు చేసిందని ఎప్పుడైనా విన్నారా" అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
భాజపాపై తీవ్ర స్థాయిలో ధ్వజం..
భాజపా.. ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నిర్మించిందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ పటేల్ ఎవరి కోసమైతే పోరాడారో, ఏ ప్రజల కోసమైతే తన ప్రాణాలను అర్పించారో వారికే అది వ్యతిరేకంగా పనిచేసిందని ధ్వజమెత్తారు. భాజపా ప్రవేశ పెట్టి రద్దు చేసిన వ్యవసాయ చట్టాలు.. రైతుల హక్కుల్ని కాలరాసేలా ఉన్నాయన్నారు. గుజరాత్‌లోని ప్రతి సంస్థను భాజపా స్వాధీనం చేసుకుందని.. ఇక్కడ యుద్ధం రెండు పార్టీల మధ్య కాదు, అధికార పక్షం స్వాధీనం చేసుకున్న ప్రతి సంస్థతో అని ఆయన ఆరోపించారు.