Rahul Gandhi Press Conference Today : నిజం ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నేరపూరిత పరువు నష్టం కేసులో తనను దోషిగా తేల్చడంపై సుప్రీంకోర్టు స్టే విధించిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన.. తనకు అండగా ఉన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తానేం చేయాలో, తాను ఏ దారిలో వెళ్లాలో అనే విషయాలపై స్పష్టత ఉందని చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. సుప్రీం నిర్ణయంతో తాను సంతోషంగా ఉన్నానని చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గెలిచిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి శిక్షపడ్డ 24 గంటల్లోపే అనర్హత వేటు వేశారని.. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దాన్ని తొలగించేందుకు ఎంత సమయం పడుతుందో చూస్తామని వ్యాఖ్యానించారు.
"రాజ్యాంగం ఇంకా బతికే ఉందనేందుకు ఈ నిర్ణయం ఉదాహరణ. ఇది సాధారణ ప్రజల విజయం. ఇది రాహుల్ గాంధీ ఒక్కరి గెలుపు కాదు. దేశ ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల గెలుపు ఇది. సత్యం కోసం, దేశ ప్రయోజనాల కోసం, యువత కోసం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోరాడుతున్న వ్యక్తికి.. ప్రజల ప్రార్థనల ఫలితం లభించింది. అందుకే ఇది ప్రజా విజయం. రాహుల్‌ను అనర్హుడిగా తేల్చే ప్రక్రియ 24 గంటల్లోపే పూర్తైంది. ఇప్పుడు ఎన్ని గంటల్లో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారో చూద్దాం."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
INDIA Alliance on Rahul Gandhi Supreme Court Order : రాహుల్ గాంధీకి విధించిన జైలుశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించటం పట్ల కాంగ్రెస్, విపక్ష కూటమి ఇండియా హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్పు బీజేపీకి, ఆ పార్టీ నేతలకు గుణపాఠం కావాలని హస్తం పార్టీ పేర్కొంది. ద్వేషంపై ప్రేమ సాధించిన విజయమిది అని హస్తం పార్టీ అభివర్ణించింది.