Rahul Gandhi Parliament Standing Committee : రక్షణశాఖపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఎంపీ రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చిలో పార్లమెంట్ సభ్యత్వం కోల్పోకముందు ఇదే కమిటీలో ఉన్న రాహుల్.. ప్రస్తుతం తిరిగి ఎంపికయ్యారు. ఈ కమిటీలోకి కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ కూడా నామినేట్ అయినట్లు లోక్‌సభ బులిటెన్ వెల్లడించింది. లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ.. వ్యవసాయం, పశుసంవర్ధక, ఫుడ్ ప్రాసెసింగ్ స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయినట్లు పేర్కొంది. లోక్‌సభ సభ్యత్వం తిరిగి పొందిన ఎన్‌సీపీ ఎంపీ ఫైజల్ మొహమ్మద్.. వినియోగదారుల వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయ్యారని తెలిపింది.
Rahul Disqualification Supreme Court : మరోవైపు 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని గుజరాత్లోని సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేళ్లు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 24న రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అప్పీలుకు వెళ్లగా.. గుజరాత్ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ను జులై 7న న్యాయస్థానం కొట్టేసింది.