Rahul Gandhi Panauti Speech EC Notice :ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని అశుభం (పనౌతీ), పిక్‌పాకెట్, రుణమాఫీ వంటి మాటలు వాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. శనివారం సాయంత్రానికల్లా దీనికి సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒక సీనియర్ నేత ఇలాంటి భాష ఉపయోగించడం అనుచితం అంటూ ఆరోపించిన బీజేపీ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈసీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ ప్రత్యర్థులపై నిరూపితంకాని ఆరోపణలు చేయరాదు.
Modi Panauti World Cup Rahul :రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ లక్ష్యంగా రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేశారు. ప్రపంచకప్ ఫైనల్లో టీమ్ఇండియా ఓటమికి మోదీ కారణమంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మోదీ స్టేడియానికి రావడం వల్ల చెడు శకునం తగిలిందని వ్యాఖ్యానించారు. అదే సభలో.. అదానీ-మోదీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రజల సొమ్మును అదానీ కాజేస్తుంటే.. మోదీ వారి దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు.
'ఏజెన్సీలు బీజేపీ వెంట పడతాయ్'
Mamata Banerjee on ED Raids :మరోవైపు.. టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా గురువారం రాహుల్ తరహాలోనే మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె.. దేశ క్రికెట్ జట్టును కాషాయీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. "భారత జట్టు సభ్యులపట్ల మేము గర్వంగా ఉన్నాం. కోల్‌కతా లేదా వాంఖడేలో ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే మనం ప్రపంచ కప్ గెలిచి ఉండేవాళ్లం. పాపులు హాజరైన మ్యాచ్ తప్ప వరల్డ్ కప్‌లోని ప్రతి మ్యాచ్‌నూ భారత జట్టు గెలిచింది." అని వ్యాఖ్యానించారు మమత.