Rahul Gandhi on PM Modi Pickpocket Case :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జారీ చేసిన నోటీసులపై ఎనిమిది వారాల్లో చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి దిల్లీ హైకోర్టు ఆదేశించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరికాదని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఎన్నికల సంఘం ఇప్పటికే నోటీసులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసిన హైకోర్టు- ఎనిమిది వారాల్లో దీనిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
నవంబర్ 22న ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాజకీయ నాయకులు అలాంటి వ్యాఖ్యలు చేయకుండా మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ భరత్ నగర్ కోరారు. మోదీని కించపరచడం సహా అత్తున్నత హోదాలో ఉన్న వ్యక్తులపై సంచలన ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. కాగా, రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నవంబర్ 23నే ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
అయితే, రాహుల్ నుంచి ఇంత వరకు వివరణ రాలేదని ఈ కేసుపై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్ణ బెంచ్ పేర్కొంది. 'ఎన్నికల సంఘం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. రాహుల్ గాంధీకి నోటీసులు కూడా జారీ చేసింది. నోటీసులకు సమాధానం చెప్పేందుకు డెడ్లైన్ ముగిసింది. ఇప్పటివరకు ఎలాంటి వివరణ రాలేదు. కాబట్టి ఈ విషయంపై 8 వారాల్లోగా చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశిస్తున్నాం' అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.