ABG Shipyard Fraud: దేశంలో అత్యధిక బ్యాంకు ఫ్రాడ్లు మోదీ హయాంలోనే జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ పాలనలో ఏకంగా రూ. 5.35 లక్షల కోట్లు విలువ చేసే మోసాలు జరిగినట్లు రాహుల్ పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఈ స్థాయిలో ఎప్పుడూ మోసాలు జరగలేదని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని ఏజీబీ షిప్‌యార్డ్ మోసంపై స్పందిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ హయాంలో కేవలం ఆయన మిత్రులకు మాత్రమే మేలు జరిగిందని పేర్కొన్నారు.
వారి కోసం ప్రత్యేక స్కీమ్..
బ్యాంకు మోసాలకు పాల్పడే వారికి 'లూట్ అండ్ ఎస్కేప్' పేరుతో మోదీ ప్రభుత్వం ప్రత్యేకమైన పథకం ఏర్పాటు చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. ఈ జాబితాలో నీరవ్ మోదీ, చోక్సీ, లలిత్ మోదీ, నీషల్ మోదీ, విజయ్ మాల్యా, జతిన్ మెహతా, చేతన్ సందేశారా వంటివారు ఎందరో ఉన్నారనని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రిషీ అగర్వాల్ సహా మరికొందరు చేరారని ఎద్దేవా చేశారు.
"ఇందులో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏబీజీ షిప్‌యార్డుకు 1,21,000 చదరపు మీటర్ల భూమిని 2007లో గుజరాత్ ప్రభుత్వం నాటి సీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేటాయించింది. ఒక చదరపు అడుగు విలువ రూ.1400 అయితే సగం ధరకే వారికి అమ్మేశారు. ఇదే విషయాన్ని కాగ్ తన నివేదికలో పేర్కొంది. అయినా లెక్కచేయకుండా.. మోదీ దహేజ్‌లో ఏజీబీ సంస్థకు 50 హెక్టార్ల భూమిని కేటాయించారు. ఆ ప్రాజెక్టును 2015లో మూసివేయడం గమనార్హం."