Rahul Gandhi On China Issue :తూర్పు లద్దాఖ్‌లో చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్.. అక్కడి ప్రజలు ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం.. చైనాకు క్లీన్చిట్ ఇచ్చారని విమర్శించారు.లద్దాఖ్‌లో ఎవరిని అడిగినా.. మోదీ చెప్పిన విషయం అబద్ధమని తెలుస్తుందని అన్నారు.
రాజీవ్ గాంధీ జయంతి నేపథ్యంలో..
Rahul Tribute To Rajiv Gandhi :తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నేపథ్యంలో రాహుల్..లద్దాఖ్లోపర్యటించారు. మోటార్ సైకిల్‌పై పాంగాంగ్ సరస్సు వద్దకు వెళ్లారు. అక్కడ రాజీవ్ గాంధీకి రాహుల్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చైనా ఆక్రమణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
"లద్దాఖ్ ప్రజలు అనేక అంశాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు వారికి ఇచ్చిన హోదా (కేంద్ర పాలిత ప్రాంతం)తో సంతృప్తిగా లేరు. తమకు ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటున్నారు. నిరుద్యోగం సమస్య కూడా ఉంది. తమ రాష్ట్రాన్ని బ్యూరోక్రాట్లు కాకుండా.. ప్రజాప్రతినిధులు పాలించాలని కోరుకుంటున్నారు. చైనా.. తమ భూభాగాన్ని తీసేసుకుందన్న ఆందోళన కూడా ఇక్కడ ఉంది. తమ ప్రాంతంలోకి చైనా సైన్యంచొరబడిందని ప్రజలు చెబుతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లే ప్రాంతాలను వారు లాగేసుకున్నారని చెప్పారు. కానీ, ప్రధాని మాత్రం.. ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేదని చెబుతున్నారు. అది నిజం కాదు. ఇక్కడ మీరు ఎవరినైనా అడగండి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ