Rahul Gandhi On Caste Census :తమ పార్టీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. యూపీఏ హయాంలో నిర్వహించిన కుల గణన వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ జిల్లాలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'ఆవాస్ న్యాయ సమ్మేళన్'లో పాల్గొన్న రాహుల్.. బీజేపీ ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. తమ పార్టీ రీమోట్ కంట్రోల్‌ను నొక్కితే సంక్షేమ ఫలాలు నిరుపేదలకు చేరతాయన్న రాహుల్... అదే బీజేపీ రీమోట్ కంట్రోల్ నొక్కితే అదానీకి విమానాశ్రయాలు, పోర్టులు, కాంట్రాక్ట్‌లు వస్తాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని కేబినెట్ క్యార్యదర్శులు, కార్యదర్శులే నడుపుతారని.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కాదని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని 90 మంది కార్యదర్శుల్లో.. ముగ్గురు మాత్రమే OBCలు ఉన్నారని పునరుద్ఘాటించారు. కేంద్ర బడ్జెట్‌లో ఐదు శాతాన్ని మాత్రమే వీరు నియంత్రిస్తున్నారన్న రాహుల్.. దేశంలో ఐదు శాతమే ఓబీసీలు ఉన్నారా అని ప్రశ్నించారు.
"బీజేపీ లేదా మోదీ ఒకసారి బటన్ నొక్కితే అదానీకి మంబయి ఎయిర్‌పోర్ట్, రెండోసారి నొక్కితే రైల్వే ప్రాజెక్టులు, మూడోసారి నొక్కితే మౌలిక సదుపాయాల కాంట్రాక్ట్‌లు లభిస్తాయి. ప్రస్తుతం రెండు రిమోట్ కంట్రోల్‌లు నడుస్తున్నాయి. ఇది మా పార్టీ రిమోట్ కంట్రోల్. దీన్ని నొక్కితే క్వింటా వరి ధాన్యానికి రూ. 2,500 నగదు నేరుగా రైతుల ఖాతాలో జమవుతాయి. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు నిర్మితమవుతాయి. అయితే బీజేపీ బటన్ నొక్కితే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ అయిపోతాయి."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు