తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేసిన రాహుల్​ గాంధీ.. సోనియా ఇంటికి సామాన్లు తరలింపు.. - రాహుల్​ గాంధీపై అనర్హత వేటు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తన అధికారిక నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. రాహుల్​ తన మాతృమూర్తి సోనియా గాంధీ నివాసానికి మకాం మార్చారు. డీసీఎం వాహనంలో రాహుల్ వస్తువులను జన్​పథ్​లోని సోనియా నివాసానికి తరలించారు.

rahul gandhi official bungalow
rahul gandhi official bungalow

By

Published : Apr 22, 2023, 4:50 PM IST

కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ దిల్లీలోని అధికారిక నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దుకావడం వల్ల అధికార నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. అందుకు ఏప్రిల్​ 22(శనివారం) వరకు గడువు ఇచ్చింది. దీంతో రాహుల్​ తన అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. దేశ ప్రజలు తనకు 19 ఏళ్లుగా అధికారిక నివాసాన్ని ఇచ్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 'నిజం మాట్లాడినందుకు ఎంత మూల్యమైనా చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేశ ప్రజలకు నా కృతజ్ఞతలు' అని రాహుల్ తెలిపారు.

అంతకుముందు.. ఏప్రిల్ 14న రాహుల్​ గాంధీకి చెందిన వస్తువులను రెండు డీసీఎం వాహనాల్లో తరలించారు. 2005 నుంచి రాహుల్‌ ఇదే నివాసంలో ఉంటున్నారు. అయితే లోక్​సభ హోసింగ్ కమిటీ నోటీసుల జారీ చేయడం వల్ల ఆయన తాజాగా ఖాళీ చేశారు. ఆయన మాతృమూర్తి సోనియా గాంధీ ఉంటున్న టెన్‌ జన్‌పథ్‌కు మకాం మార్చినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

డీసీఎంలో రాహుల్ గాంధీ వస్తువులు తరలింపు
డీసీఎంలో రాహుల్ గాంధీ వస్తువులు తరలింపు

ఇదీ కేసు..
2019 లోక్​సభ ఎన్నికల సమయంలో మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్​కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టును ఆశ్రయించారు. మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పై కోర్టుల్లో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 30 రోజుల పాటు వాయిదా వేసింది. అనంతరం రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్లకు పైగా శిక్ష పడిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. రాహుల్ గాంధీ లోక్​సభ సభ్యత్వం రద్దైంది. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాహుల్​.. తన బంగ్లాను శనివారం ఖాళీ చేశారు.

కోర్టులో చుక్కెదురు
పరువు నష్టం కేసులో శిక్షపడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి గుజరాత్‌లోని సూరత్‌ కోర్టులో చుక్కెదురైంది. ఆయన తనకు పడిన శిక్షపై స్టే విధించాలని చేసిన అభ్యర్థనను ఏప్రిల్​ 20న కోర్టు కొట్టివేసింది. రాహుల్​ దాఖలు చేసిన పిటిషన్​ను సూరత్​ సెషన్స్​ కోర్టు జడ్జి ఆర్‌పీ మొగేరా తిరస్కరించారు. ఈ సందర్భంగా జడ్జి ఆర్​పీ మొగేరా కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్​ గాంధీ కాస్త జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిందని పేర్కొన్నారు. ఆయనొక పార్లమెంట్​ సభ్యుడే గాక.. మోదీపై వ్యాఖ్యలు చేసిన సమయంలో దేశంలోని రెండో అతిపెద్ద పార్టీకి అధ్యక్షుడు అని మొగేరా వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details