Rahul Gandhi Modi Surname Case: 'మోదీ ఇంటి పేరు'పై వ్యాఖ్యలకు నమోదైన పరువు నష్టం కేసులో తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ప్రతివాదులైన గుజరాత్ సర్కారు, ఆ రాష్ట్ర ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. అనంతరం ఆగస్టు 4కు విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను నిలిపివేయాలన్న రాహుల్ అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ సుప్రీంను ఆశ్రయించారు.
Rahul Gandhi Defamation Case : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరఫున.. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టు ముందు వాదనలు వినిపించారు. సూరత్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాని పరిస్థితి ఎదురయ్యిందని సింఘ్వి కోర్టుకు తెలిపారు. వీలైనంత త్వరగా రాహుల్ పిటిషన్‌ను విచారించాలని ధర్మాసనానికి సింఘ్వి విజ్ఞప్తి చేశారు.