Rahul Gandhi Mizoram :ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్లో జరిగిన అల్లర్ల కంటే ఇజ్రాయెల్‌లో జరుగుతున్న యుద్ధంపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో సోమవారం పాదయాత్ర నిర్వహించిన ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
'మణిపుర్ ఒక్క రాష్ట్రం కాదు..'
రెండు రోజుల మిజోరాం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం రాజధాని ఐజ్వాల్‌కు చేరుకున్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ పర్యటనలో భాగంగా ఐజ్వాల్‌లోని చన్మారి జంక్షన్ నుంచి రాహుల్ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో రాహుల్‌కు ప్రజలు పెద్దఎత్తున వచ్చి, స్వాగతం పలికారు. రాజ్‌భవన్ వరకు దాదాపు 2 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు రాహుల్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ సెల్ఫీలు దిగారు. పాదయాత్ర ముగిసిన అనంతరం రాజ్‌భవన్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడారు. ఈ సందర్భంగా 'ఒక్క రాష్ట్రంగా ఉన్న పక్క రాష్ట్రం మణిపుర్‌ను రెండు రాష్ట్రాలుగా విభజించారు' అని ఆయన మండిపడ్డారు.
'బీజేపీ భారత్‌లోని వివిధ వర్గాలు, మతాలు, భాషలపై దాడి చేస్తోంది. వారు దేశంలో ద్వేషం, హింసను ప్రేరేపిస్తున్నారు. అహంకారం, అవగాహన లేమితో పాలనను కొనసాగిస్తున్నారు. ఇది భారతదేశ ఆలోచనలకు పూర్తి విరుద్ధం' అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"1986లో శాంతి ఒప్పందంపై సంతకం చేయడం వల్లే తిరుగుబావుట నినాదం ఎత్తుకున్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో కాంగ్రెస్ శాంతిని నెలకొల్పింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను గాడిన పెట్టగలిగాము."