Rahul Gandhi Meets Railway Coolies :కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రైల్వే కూలీలతో మమేకమయ్యారు. దిల్లీలోని ఆనంద్‌విహార్ రైల్వే స్టేషన్‌ను గురువారం ఉదయం ఆకస్మాత్తుగా రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న రైల్వే కూలీలతో ముచ్చటించారు. నేలపై కూర్చొని రైల్వే కూలీల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా రైల్వే కూలీల యూనిఫాం వేసుకుని తలపై లగేజీని మోశారు. ఈ విషయం బయటకు తెలియడం వల్ల రాహుల్‌ను చూసేందుకు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు ప్రజలు భారీగా తరలివచ్చారు.
కాగా.. గత నెలలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలవాలని ఉందని రైల్వే కూలీలు మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్.. గురువారం వారిని కలవడం గమనార్హం. రాహుల్ తమను కలవడం పట్ల కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. తమ కష్టాలను రాహుల్ విన్నారని తెలిపారు.
రాహుల్.. కూలీలతో మమేకమైన వీడియోను కాంగ్రెస్ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. భారత్ జోడో యాత్ర కొనసాగుతోందని పేర్కొంది. 'మహాత్మా గాంధీ ఆలోచనల స్ఫూర్తితో మాస్ లీడర్ రాహుల్ గాంధీ.. భారత్‌ను ఏకం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. రాహుల్ కాన్వాయ్ గురువారం ఉదయం దిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రైల్వే కూలీల బాధలు, సమస్యలను రాహుల్ విన్నారు.' అని ఎక్స్‌లో రాసుకొచ్చింది.
అలాగే రైల్వే కూలీలతో మమేకమవ్వడంపై సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ వేదికగా రాహుల్ స్పందించారు. 'గురువారం.. దిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్‌లో కూలీ సోదరులను కలిశాను. వారిని కలవాలని నాకు చాలా కోరికగా ఉంది. కూలీ సోదరులు నన్ను కలవాలని ప్రేమగా పిలిచేసరికి ఈ రోజు వారిని కలిశాను' అని అన్నారు.