Rahul Gandhi Meet Ponguleti and Jupalli : బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైన తరుణంలో.. ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు 35 మంది నేతలు.. ఆ పార్టీ అధిష్ఠానంతో భేటీ అయ్యారు. ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో.. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి భేటీ అయ్యారు.
గతంలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు.. తిరిగి సొంతగూటికి చేరుతుండటం ఆనందంగా ఉందని రాహుల్ చెప్పారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం జరుగుతోందని వ్యాఖ్యానించిన రాహుల్.. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఇందుకు పార్టీ నేతలంతా సమష్టిగా పోరాడాలని రాహుల్ దిశానిర్దేశం చేసినట్లు నేతలు పేర్కొన్నారు. పార్టీలో చేరిక సందర్భంగా నిర్వహించే సభకు రావాలని ఈ సందర్భంగా రాహుల్, ఖర్గేను ఇద్దరు నేతలు ఆహ్వానించారు..
Ponguleti SrinivasReddy Fires on KCR :పదవులు, వ్యాపారం కంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని భావించి.. అధికారంలో లేకున్నా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, కర్ణాటకలో విజయంతో.. తెలంగాణలో హస్తం పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్న పరిణామాలను బేరీజు వేసుకున్నట్లు వివరించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ప్రజలు కేసీఆర్‌ను గెలిపించినా.. ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేర్చలేదని విమర్శించారు. జులై 2న ఖమ్మం వేదికగా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు.. కనివీని ఎరుగని రీతిలో ఈ బహిరంగసభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నేతలకుపొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరారు.
"ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చారు. మాయమాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. మాయమాటలతో కేసీఆర్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారు. ఆరు నెలల విశ్లేషణ తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. వ్యాపారమే ముఖ్యమనుకుంటే కాంగ్రెస్‌లో చేరేవాడిని కాదు. ఇప్పటికే నాకు ఇబ్బందులు మొదలయ్యాయి. బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసురుతున్నా. మా ఖమ్మం సభకు ఎన్ని లక్షల మంది వస్తారో లెక్కేసుకోండి."- పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ
Jupalli Krishna Rao Comments on KCR :ఈసారి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వకపోతే దేవుడు కూడా క్షమించడని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావువ్యాఖ్యానించారు. ఆంధ్రలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ వెంట నడవాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో బహిరంగసభ ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరుతానన్న ఆయన.. పార్టీ అధినాయకుల వీలు ప్రకారం తేదీలు ఖరారు చేయనున్నట్లు జూపల్లి కృష్ణారావు చెప్పారు.
"తెలంగాణ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగం చేశారు. నాడు పదవులు వదిలి ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ వచ్చాక మా అంచనాలన్నీ తప్పాయి. కేసీఆర్ పాలనంతా బోగస్ మాటలు, పథకాలతో సాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో జిమ్మిక్కులు చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకే ఉండవద్దని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ తీరు అంబేడ్కర్‌ను అవమానించేలా ఉంది. దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రచారానికి ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి పరాకాష్టకు చేరింది." - జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి
అనంతరం, దిల్లీ 10జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లిన పొంగులేటి, జూపల్లి.. ప్రియాంకా గాంధీతో భేటీ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసే బహిరంగసభకు హాజరుకావాలని ప్రియాంకను కోరినట్లు జూపల్లి కృష్ణారావు తెలిపారు.
ఇవీ చదవండి :T Congress Leaders Delhi Tour : హైకమాండ్ పిలుపు.. నేడు దిల్లీకి టి-కాంగ్రెస్ నేతలు
T Congress Strategises : తెలంగాణలో 'కర్ణాటక ప్లాన్'.. రంగంలోకి యువజన కాంగ్రెస్