Rahul Gandhi Manipur Violence :ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో జరుగుతున్న హింసను ఆపడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అల్లర్లు, అత్యాచారాలు, హత్యలతో నాలుగు నెలలుగా మణిపుర్ అట్టుడుకుతుంటే.. పార్లమెంట్‌లో ప్రధాని నవ్వుతూ, జోకులు వేశారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఈశాన్య రాష్ట్రం ఇంకా తగలబడాలనే ప్రధాని కోరుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Rahul Gandhi Press Meet : లోక్సభలో మోదీ.. మొత్తం 2 గంటల 13 నిమిషాలు మాట్లాడారని.. అందులో చివరగా రెండు నిమిషాలు మాత్రమే మణిపుర్ గురించి ప్రస్తావించారని విమర్శించారు. నెలల తరబడి మణిపుర్ తగలబడుతున్నప్పుడు.. పార్లమెంట్‌లో మోదీ జోకులు వేస్తూ నవ్వడం ఆయనకు తగదంటూ రాహుల్ మండిపడ్డారు. శుక్రవారం దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాహుల్.. మణిపుర్ మండిపోతున్న విషయం మోదీ మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.
"ప్రధాన మంత్రి ఓ రాజకీయ నాయకుడిగా మాట్లాడకూడదు. లోక్సభలో మోదీ మాట్లాడిన తీరు విచారకరం. ప్రధాని.. రాజకీయ నేత కాదు.. మనందరి ప్రతినిధి. గతంలో ఎందరో ప్రధానులను చూశాను. కానీ ఇలా స్థాయి దిగజారి మాట్లాడిన ప్రధానిని నేను చూడలేదు. అసలు సమస్య గురించి మాట్లాడలేదు. మణిపుర్ తగలబడుతోందా? లేదా? అన్నదే ప్రధాన సమస్య."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత