Rahul Gandhi Manipur : మణిపుర్‌లోని అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ. హింస సమస్యకు పరిష్కారం కాదన్నారు. మణిపుర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మణిపుర్‌లో జరిగిన ఘటనలు రాష్ట్రానికి, దేశానికి బాధాకరమన్నారు.
రాష్ట్రంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని మణిపుర్ గవర్నర్ అనసూయ ఉకియ్కు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. "శాంతియుంతగా ఉండటమే సమస్య పరిష్కారానికి మార్గం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు శాంతి గురించే మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి నేను ఏ విధంగానైనా సహాయం చేస్తాను." అని రాహుల్ గాంధీ అన్నారు. మణిపుర్ ప్రజల బాధనే తాను పంచుకుంటున్నట్లు తెలిపారు. ఇదొక భయంకరమైన విషాద ఘటన అని వెల్లడించారు. మణిపుర్‌లో శాంతిని నెలకొల్పే దిశగా చర్యలు తీసుకుంటామని గవర్నర్ తమకు హామీ ఇచ్చిననట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు.. రాష్ట్రంలో ఇంటర్నెట్ సర్వీస్‌పై ఉన్న నిషేధాన్ని జులై 5 వరకు పొడిగించింది మణిపుర్ ప్రభుత్వం.
మణిపుర్‌లో పర్యటించిన రాహుల్‌గాంధీ శుక్రవారం.. బిష్ణుపుర్ లోని రెండు పునరావాస శిబిరాలను సందర్శించారు. అక్కడ తలదాచుకుంటోన్న బాధితులను ఆయన పరామర్శించారు. వారి ఆవేదనతో తన హృదయం చలించిపోయిందని వివరించారు. నిర్వాసితులకు అక్కడ తగిన సౌకర్యాలు లేవని రాహుల్ తెలిపారు. వారికి సరైన ఆహారం, ఔషధాలు అందించాలని డిమాండ్ చేశారు.
మణిపుర్ అల్లర్లలోఆత్మీయులను, ఆస్తులను కోల్పోయిన వారి వేదన హృదయ విదారకంగా ఉందని రాహుల్ తెలిపారు. ప్రతి ఒక్కరి ముఖం.. సాయం కోసం అర్థిస్తున్నట్లే కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. శాంతిస్థాపనే ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయమని.. ప్రజల జీవితాలు, జీవనోపాధికి భద్రత కల్పించడం అత్యవసరమని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే పౌర సంఘాల సభ్యులతోనూ రాహుల్ భేటీ అయ్యారు. వీరిలో మణిపుర్ సమగ్రత సమన్వయ కమిటీ, యునైటెడ్ నాగా కౌన్సిల్, ఎస్టీ డిమాండ్ కమిటీ తదితర పౌర సంఘాల సభ్యులు ఉన్నారు.
ఉద్రిక్తంగా రాహుల్ మణిపుర్ పర్యటన..
Rahul Manipur visit : గురువారం మణిపుర్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కొద్దిసేపు అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. దిల్లీ నుంచి మణిపుర్ రాజధాని ఇంఫాల్ చేరుకున్న రాహుల్, రోడ్డు మార్గం ద్వారా చురచంద్‌పుర్‌కు బయలుదేరారు. అయితే, భద్రతా కారణాలతో రోడ్డుమార్గం ద్వారా వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్ చేయండి.