కర్ణాటక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నలిన్ కుమార్ కటీల్ (Nalin Kumar Kateel news)... కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాదక ద్రవ్యాలకు ముడిపెడుతూ వివాదాస్పదంగా మాట్లాడారు.
ఉపఎన్నికలు (Karnataka by election 2021) ఉన్న హనగల్, సింధగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న భాజపా, కాంగ్రెస్‌లు.. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇందులో భాగంగా హుబ్లిలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు భాజపా నేత కటీల్. రాహుల్ గాంధీకి పార్టీని నడిపించడమే రాదని, అలాంటిది దేశాన్నెలా నడిపిస్తారని ప్రశ్నించారు.
"రాహుల్ గాంధీకి డ్రగ్స్‌కు ఉన్న సంబంధం గురించి నేను మాత్రమే చెప్పడం లేదు. మీడియా చెబుతోంది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. తమ పార్టీనే నడిపించలేక పోతున్నారు. రాజకీయ పార్టీనే నడిపించనివారు దేశాన్నెలా ముందుకు నడిపిస్తారు? అలాంటి వారు ప్రధాని మోదీ గురించి మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ రెండుగా చీలిపోతుంది."
-నలిన్ కుమార్ కటీల్, భాజపా కర్ణాటక విభాగం అధ్యక్షుడు
కాంగ్రెస్ నేతల ఎదురుదాడి
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్ణాటక అసెంబ్లీలో విపక్ష నేత సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. కటీల్ ఓ పరిపక్వత లేని నాయకుడని అన్నారు. 'రాహుల్ గాంధీపై చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన రాజకీయ నేతను ఇంతవరకు చూడలేదు. ఆయన మానసిక స్థిరత్వాన్ని కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటే మంచిది' అంటూ చురకలంటించారు.
'క్షమాపణ చెప్పాలి'
రాజకీయాల్లో గౌరవప్రదంగా, సభ్యతతో వ్యవహరించాలని కటీల్‌కు.. కాంగ్రెస్ కర్ణాటక విభాగం అధ్యక్షుడు డీకే శివకుమార్ హితవు పలికారు. ప్రత్యర్థుల పట్ల కూడా గౌరవంతో ఉండాలని అన్నారు. తన వ్యాఖ్యలతో భాజపా ఏకీభవిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తారని ఆశిస్తున్నానని అన్నారు.
'ఆయనో మూర్ఖుడు'
కేపీసీసీ మాజీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు సైతం కటీల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆయనో మూర్ఖుడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. క్షమాపణ చెప్పాలన్న కనీస మర్యాద లేదని వ్యాఖ్యానించారు. కటీల్‌ను వెంటనే భాజపా అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ప్రియాంకను చూస్తే రాహుల్‌కు భయం.. పీకే సంచలన వ్యాఖ్యలు!