Rahul Gandhi INDIA Alliance PM Candidate :విపక్షాల 'ఇండియా' కూటమి ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉండాలని భావిస్తున్నట్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ వెల్లడించారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Rahul Gandhi Bharat Jodo Yatra) తర్వాత ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని ఆయమ ఆరోపించారు.
అందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు (Rahul Gandhi Disqualification) వేశారని భూపేశ్ బఘేల్ ఆరోపించారు. ఆయన అధికారిక నివాసన్ని కూడా అందుకే లాగేసుకున్నారని విమర్శించారు. నియంతృత్వ వ్యక్తులను అధికారం నుంచి తరిమికొట్టడమే 'ఇండియా' కూటమి ప్రధాన లక్ష్యమని తేల్చి చెప్పారు. కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఏవైనా విభేదాలు ఉంటే.. చర్చల ద్వారా పరిష్కారం అవుతాయని ఆయన స్పష్టం స్పష్టం చేశారు. దీని కోసం పార్టీల పెద్దలు చర్చలు జరుపుతున్నారని.. వారు అనువజ్ఞులైన వ్యక్తులని తెలిపారు. పరిష్కారం తప్పకుండా కనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
"ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి బీజేపీ నాయకత్వంలో అసంతృప్తి నెలకొంది. ప్రధానితో సహా వారి నాయకులు స్పందిస్తున్న తీరు చూస్తే.. ఈ కూటమికి భయపడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. వంశపారంపర్య రాజకీయాలు, అవినీతిపై మోదీకి భిన్నమైన కొలమానాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వారిపై దాడులు చేస్తూనే ఉంటారు. అయితే వారు బీజేపీలో చేరిన వెంటనే ఆ దాడులు ఆగిపోతాయి. అందులో భాగంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర, అసోం నాయకులపై దాడులు జరిగాయి. వారు బీజేపీలో చేరిన వెంటనే అవి ఆగిపోయాయి"
-- భూపేశ్ బఘేల్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి