కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట లభించింది. 'మోదీ' ఇంటిపేరు కేసులో ఆయనపై దిగువ కోర్టు జారీ చేసిన సమన్లపై సోమవారం స్టే విధించింది. మోదీ అనే ఇంటిపేరును కించపర్చారంటూ బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ దాఖలు చేసిన పిటిషన్‌పై మార్చి 30న పట్నాలోని ఎంపీ/ ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ ఏప్రిల్ 25వ తేదీన తమ ఎదుట వాంగ్మూలం నమోదు నిమిత్తం హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.
పట్నా హైకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట.. 'మోదీ' ఇంటిపేరు కేసులో స్టే! - rahul got relief in bihar high court
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పట్నా హైకోర్టులో ఊరట లభించింది. 'మోదీ' ఇంటిపేరు కేసులో ఆయనపై దిగువ కోర్టు జారీ చేసిన సమన్లపై సోమవారం స్టే విధించింది.
వాస్తవానికి మార్చి 18నే ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన పట్నాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు.. ఏప్రిల్ 12న రాహుల్ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే, ప్రస్తుతం సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ వ్యవహారంలో తాము బిజీగా ఉన్నందున విచారణ వాయిదా వేయాలని రాహుల్ న్యాయవాదుల బృందం కోర్టును కోరింది. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 25వ తేదీకి విచారణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పట్నా హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ రాహుల్ తరపున న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం దిగువ కోర్టు ఆదేశాలపై మే 15వ తేదీ వరకు స్టే విధించింది. మరోవైపు పిటిషన్ వేసిన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ దీనిపై స్పందించారు. తాను వేసిన దావాలో కూడా రాహల్ గాంధీకి తగిన శిక్షపడే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదీ కేసు..
2019లో కర్ణాటకలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. మోదీ ఇంటిపేరుపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌లోని సూరత్‌లో పరువునష్టం దావా దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. దీనిపై ఇటీవల విచారణ జరిపిన సూరత్ కోర్టు.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వెలువడిన 24 గంటల్లోపే ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు లోక్‌సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అంతే కాకుండా ఈ వేటు కారణంగా ప్రజాప్రతినిధులకు కేటాయించే అధికారిక భవనాన్ని కూడా రాహుల్ ఇటీవలే ఖాలీ చేశారు. కాగా, రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు.