Rahul Gandhi Europe Trip : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో యూరప్‌లోని పలు దేశాలను ఆయన సందర్శించనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ.. యూరోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్లతో సమాచారం అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దాంతో పాటు ప్రవాస భారతీయులు, విశ్వవిద్యాలయ విద్యార్థులతో సమావేశం అవుతారని వర్గాలు పేర్కొన్నాయి. బెల్జియం, నార్వే, ఫ్రాన్స్ దేశాలను సందర్శిస్తారని తెలిపాయి.
రాహుల్ అమెరికా పర్యటన..
Rahul Gandhi Us Visit :మేలోనూ పది రోజుల పాటు అమెరికా పర్యటన చేశారు రాహుల్ గాంధీ. అందులో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ నగరాలను ఆయన సందర్శించారు. పర్యటనలో భాగంగా అక్కడి చట్టసభ సభ్యులు, ప్రవాస భారతీయులు, పారిశ్రామికవేత్తలతో రాహుల్ సమావేశమయ్యారు. ఆ పర్యటనలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్.
బీజేపీ సర్కారు భారత ప్రజలను భయపెడుతోందని.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని రాహుల్ ఆ పర్యటనలో దుయ్యబట్టారు. ప్రధాని మోదీ దేవుడికే పాఠాలు చెప్పే ఘనుడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాంతోపాటు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో చర్చా కార్యక్రమం నిర్వహించారు రాహుల్ గాంధీ. అంతా తమకే తెలుసని ప్రజలను నమ్మించే వ్యక్తులు భారత్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. వారు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని చెబుతారని ఎద్దేవా చేశారు. అనంతరం ప్రవాస భారతీయులతోనూ రాహుల్ సమావేశమయ్యారు.