Rahul Gandhi ED case: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ కొనసాగుతోంది. ఐదోరోజైన గురువారం రాహుల్ గాంధీని 9 గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఉదయం 11.15 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లిన రాహుల్.. మధ్యలో భోజన విరామం కూడా తీసుకోలేదు. రాత్రి 8 గంటల వరకు ఈడీ అధికారులతోనే ఉన్న ఆయన.. అరగంట విరామం తర్వాత మళ్లీ కార్యాలయానికి వెళ్లారు. అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగినట్లు అధికారులు తెలిపారు. రాహుల్ గాంధీ వాంగ్మూలంతో పాటు లిఖితపూర్వకంగా సమాధానాలు సేకరించినట్లు చెప్పారు. మొత్తం ఐదు రోజుల్లో సుమారు 55 గంటల పాటు ఆయన్ను ఈడీ విచారించింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రశ్నలు సంధించింది.
Rahul Gandhi news today: మరోవైపు, రాహుల్ గాంధీని భాజపా వేధింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. వ్యక్తిగత కక్షతో రాహుల్‌పై పగతీర్చుకుంటోందని ఆరోపించింది. కీలకమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్ సమస్యలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుందని ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మండిపడ్డారు.
"భాజపా ఆవేశంతో ఉంది. ఈడీని పంజరంలో బంధించింది. భాజపాకు వ్యతిరేకంగా నిరంతరం గళమెత్తుతున్నందునే రాహుల్‌ను మోదీ సర్కారు వేధిస్తోంది. ఈడీ విచారణ ప్రక్రియ రాజ్యాగబద్ధంగా లేదు. ప్రతీదీ వ్యక్తిగతమే. పరిపాలనలో విఫలమైన మోదీ సర్కారు.. అరకొరగా రూపొందించిన విధానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. అంతం లేనన్ని ప్రశ్నలు అడగడం ఏంటి? షేర్ హోల్డర్ వద్ద సంస్థ ఆస్తులు ఉండవు. ఏజేఎల్ ఆస్తులకు యంగ్ ఇండియా యజమాని కాదు. యంగ్ ఇండియన్ మైనారిటీ షేర్ హోల్డర్ మాత్రమే. ఈ ప్రశ్నను ఎన్నిసార్లు అడుగుతారు. యంగ్ ఇండియా అనేది సెక్షన్ 25 కంపెనీ. దాని వల్ల షేర్ హోల్డర్లకు ఎలాంటి లాభాలు రావు. ఏడేళ్లు గడిచినా ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆధారాలతో ఎందుకు రాలేకపోతోంది?" అని సింఘ్వి ప్రశ్నించారు.