తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండోరోజు ముగిసిన రాహుల్​ విచారణ.. బుధవారం మరోసారి..

RAHUL GANDHI ED LIVE UPDATES
RAHUL GANDHI ED LIVE UPDATES

By

Published : Jun 14, 2022, 11:27 AM IST

Updated : Jun 14, 2022, 10:18 PM IST

21:54 June 14

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణ రెండో రోజు కొనసాగింది. దాదాపు తొమ్మిది గంటల పాటు విచారించిన ఈడీ.. బుధవారం కూడా హాజరు కావాలని రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 50 కింద విచారిస్తున్న ఈడీ.. రెండో రోజు కూడా ఇంకా ప్రశ్నలు పూర్తి కానందున రేపు మరోసారి హాజరు కావాలని సమన్లులో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 19 గంటల పాటు రాహుల్‌ను విచారించారు. రెండోరోజు విచారణలో భాగంగా పలు ప్రశ్నలు సంధించిన ఈడీ అధికారులు.. రాహుల్‌ స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. ఈ రోజు ఉదయం 11.05 గంటలకు రాహుల్‌ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకోగా.. అధికారులు మధ్యాహ్నం ఆయనకు గంట పాటు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చారు. దీంతో రాహుల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3.45గంటల సమయంలో బయటకు వచ్చారు. లంచ్‌ బ్రేక్‌ ముగిసిన అనంతరం సాయంత్రం 4.45 గంటల సమయంలో తిరిగి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ రెండో రోజు కూడా కాంగ్రెస్‌ శ్రేణులు దిల్లీలో నిరసనలు తెలిపాయి. జన్‌పథ్‌ వద్ద నిరసన తెలిపిన ఆ పార్టీ సీనియర్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, అధిర్‌ రంజన్‌ చౌధురి, గౌరవ్‌ గగొయ్‌, దీపేందర్‌ సింగ్‌ హుడా, రంజీత్‌ రంజన్‌, ఇమ్రాన్‌ ప్రతాప్‌ గ్రహి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని బాదార్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

16:44 June 14

  • భోజన విరామం అనంతరం.. తిరిగి ఈడీ కార్యాలయం చేరుకున్న రాహుల్ గాంధీ.
  • రెండో రోజు కొనసాగుతున్న విచారణ.

13:43 June 14

రాహుల్​కు లంచ్​ బ్రేక్​..

  • ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన రాహుల్ గాంధీ
  • భోజన విరామం ఇచ్చిన ఈడీ
  • అనంతరం మరోసారి విచారణకు హాజరు కానున్న రాహుల్ గాంధీ

11:18 June 14

రెండోరోజు ఈడీ కార్యాలయానికి రాహుల్.. నేతల భారీ నిరసన.. పలువురు అరెస్ట్!

RAHUL GANDHI ED: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రెండో రోజు విచారణకు హాజరైన రాహుల్.. ముందుగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, పలువురు నేతలు రాహుల్​కు సంఘీభావం తెలిపారు.

ముఖ్యనేతలనే ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఇతర కాంగ్రెస్ నేతలను లోనికి వెళ్లనియకుండా అడ్డుకున్నారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనుదిరగాల్సి వచ్చింది. అదేసమయంలో, మాన్ సింగ్ రోడ్ సర్కిల్​పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఆందోళన చేస్తున్న కొంతమంది కాంగ్రెస్ ఎంపీలను దిల్లీ పోలీసులు నిర్బంధించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలాను సైతం అదుపులోకి తీసుకున్నారు.

ట్రాఫిక్ జామ్ నియంత్రణకు ఏర్పాట్లు
రాహుల్‌ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో దిల్లీ లుటియన్స్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ జామ్ నివారించేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం వరకు ఏఐసీసీ, ఈడీ కార్యాలయాలకు వెళ్లే దాదాపు అన్ని మార్గాలను పోలీసులు మూసేశారు. కాంగ్రెస్ శ్రేణుల నిరసనలను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, మంగళవారం అలాంటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్ గాంధీ ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న తర్వాత ట్రాఫిక్‌ సాధారణంగా సాగేందుకు పలు మార్గాల్లో వాహనాలను అనుమతించనున్నట్లు వెల్లడించారు.

ఆ రూట్లు బంద్
ప్రస్తుతం అక్బర్ రోడ్, జనపథ్ రోడ్, అబ్దుల్ కలాం మార్గ్, పృథ్వీరాజ్ రోడ్డు, మోతీలాల్ నెహ్రూ మార్గ్, సునేహ్రీ బాగ్ మార్గాలను పోలీసులు మూసేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ మర్గాల్లో ట్రాఫిక్‌ అనుమతించేది లేదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

అదేసమయంలో, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మంగళవారం కూడా ఆందోళన కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దీంతో పోలీసులు సైతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ విధించినప్పటికీ.. ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.

Last Updated : Jun 14, 2022, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details