తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ ముందుకు రాహుల్.. నియంతృత్వమా? 'నల్ల ఖజానా' రక్షణా? - కాంగ్రెస్ ర్యాలీ టుడే

Rahul Gandhi ED case: రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు పంపడంపై కాంగ్రెస్, భాజపా వర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. అక్రమాస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్ ర్యాలీలు చేస్తోందని భాజపా మండిపడింది. కాగా, సత్యాన్ని భాజపా అణచివేయలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఆరోపణల నుంచి రాహుల్ గాంధీ బయటపడతారని ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విశ్వాసం వ్యక్తం చేశారు.

Rahul Gandhi ED case
Rahul Gandhi ED case

By

Published : Jun 13, 2022, 2:43 PM IST

Rahul Gandhi ED case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో రాజకీయ వర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ ఆందోళనల్లో పాల్గొనడంపై భాజపా మండిపడింది. అవినీతికి మద్దతిస్తూ వీరంతా ర్యాలీలు చేస్తున్నారని, గాంధీ కుటుంబానికి చెందిన రూ.రెండు వేల కోట్ల ఆస్తులను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ధ్వజమెత్తింది. ఆందోళనలు చేస్తూ ఈడీపై కాంగ్రెస్ ఒత్తిడి పెంచుతోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.

కాంగ్రెస్ ర్యాలీ

"ఎవరూ చట్టానికి అతీతులు కాదు. రాహుల్ గాంధీ కూడా అంతే. చేసిన అవినీతి బయటపడింది కాబట్టే ఈడీపై ఒత్తిడి పెంచేందుకు వారు ఇలా చేస్తున్నారు. హవాలా ఆపరేటర్ డాటెక్స్ మర్చండైజ్​తో గాంధీ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? దీని గురించి కాంగ్రెస్ నేతలు ప్రశ్నించాలి. రూ.2వేల కోట్ల ఆస్తుల్ని చేజిక్కించుకునేందుకు 'యంగ్ ఇండియన్'ను ముంచేశారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న మాజీ న్యూస్​పేపర్ పబ్లిషింగ్ కంపెనీపై గాంధీ కుటుంబానికి ఎందుకు అంత మక్కువ? రాహుల్ బావగారికే(రాబర్ట్ వాద్రాను ఉద్దేశించి) కాదు గాంధీ కుటుంబం అంతటికీ రియల్ ఎస్టేట్ అంటే ఇష్టమే."
-స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి

పోలీసుల అదుపులో ప్రముఖులు
మరోవైపు, మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. విచారణరు రావాల్సిందిగా ఈడీ సమన్లు పంపించిన నేపథ్యంలో రాహుల్ ఈడీ ఎదుట హాజరయ్యారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు రాహుల్​ వెంట ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. వీరి ర్యాలీలకు అనుమతులు లేవని చెబుతూ వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అధీర్ రంజన్ చౌదురి వంటి ప్రముఖులనూ తమ అధీనంలోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్​కు తరలించారు. కాగా, పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ ఆరోపించారు. ఈడీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో పోలీసులు తమపై చెయ్యి చేసుకున్నారని తుగ్లక్ రోడ్ స్టేషన్​ హౌస్ అధికారికి లేఖ రాశారు. మరోవైపు, వీరిని పరామర్శించేందుకు ప్రియాంకా గాంధీ.. పోలీస్ స్టేషన్​కు వెళ్లారు.

పోలీస్ స్టేషన్​లో అధీర్ రంజన్, కేసీ వేణుగోపాల్
ప్రియాంక పరామర్శ

సీఎం అరెస్ట్..?
కాగా, తనను పోలీసులు అరెస్టు చేశారని ఛత్తీస్​గఢ్ సీఎం బఘేల్ ఆరోపించారు. ఎందుకు అరెస్టు చేశారో దిల్లీ పోలీసులు చెప్పాలని డిమాడ్ చేశారు. 'ఎఫ్ఐఆర్ లేని కేసులో ఈడీ రాహుల్​కు సమన్లు పంపింది. ఇది నియంతృత్వ పరిపాలన. కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నారు. వారిని అరెస్టు చేశారు. నన్నూ నిర్బంధించారు. కాంగ్రెస్ కార్యకర్తలను.. తమ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా చేయడం ఆశ్చర్యకరం' అని బఘేల్ చెప్పుకొచ్చారు. అయితే, బఘేల్​ను అరెస్టు చేయలేదని, కేవలం అదుపులోకి తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు. పలుమార్లు హెచ్చరికలు చేసినా.. ఈడీ కార్యాలయం వద్ద నుంచి ఆయన వెళ్లకపోవడం వల్ల అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

కాంగ్రెస్ బెలూన్
కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

'రాహుల్​కు సర్కారు భయపడుతోంది'
మరోవైపు, కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా.. అధికార పక్షంపై నిప్పులు చెరిగారు. సత్యాన్ని చూసి గాడ్సే వారసులు భయపడుతున్నారని, గాంధీ వారసత్వాన్ని సవాల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ సర్కారు దిల్లీలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించిందని, వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్​కు మోదీ ప్రభుత్వం భయపడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ సత్యం కోసం పోరాడుతోందని, దీన్ని కొనసాగిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. నిజాన్ని భాజపా ఎప్పటికీ అణచివేయలేదని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సమరంలో సత్యాగ్రహాన్ని ప్రారంభించింది కాంగ్రెసేనని, దాని గురించి భాజపా తమకు నేర్పలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఈడీ అడిగే ప్రశ్నలన్నింటికీ ఎన్నికల్లో సమాధానం చెబుతామని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్, ఎంపీ రంజీత్ రంజన్ సహా పలువురు నేతలు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

ఖర్గే, జైరాం రమేశ్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు

మరోవైపు, రాహుల్​కు ఈడీ సమన్లు జారీ చేయడంపై ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. నిరాధార ఆరోపణల నుంచి రాహుల్ గాంధీ బయటపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలాంటి వేధింపులతో దేశ ప్రజలను ప్రభుత్వం అణచివేయలేదని చెప్పుకొచ్చారు. "వారు(రాహుల్​ను ఉద్దేశించి) సత్యం కోసం పోరాడుతున్నారు. దేశ ప్రజలకు మాకు అండగా ఉన్నారు. సత్యమే గెలుస్తుందని నా విశ్వాసం. ఇలాంటి వేధింపులతో దేశ ప్రజలను అణచివేయలేరు. బదులుగా.. ప్రజలంతా ఐక్యంగా మారతారు" అని వివరించారు వాద్రా. తనను సైతం ఈడీ 15 సార్లు పిలిచిందని.. వెళ్లిన ప్రతిసారి అన్ని వివరాలు సమర్పించానని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. రాహుల్ సైతం ఆరోపణల నుంచి బయటపడతారని చెప్పారు.

కాంగ్రెస్ ర్యాలీ నేపథ్యంలో భద్రత కోసం దిల్లీలో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంపై ఆ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుల్డోజర్లు కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. మైనారిటీల జీవితాలను, ఇళ్లను కూల్చివేసేందుకు వాటిని వినియోగిస్తున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details