తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆగని ఆందోళనలు.. రాహుల్​కు మద్దతుగా నల్ల వస్త్రాలతో విపక్ష ఎంపీల నిరసన - అదానీ కుంభకోణం కాంగ్రెస్ నిరసన

రాహుల్ గాంధీపై అనర్హతకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పార్టీ ప్రస్తుత, మాజీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ.. పార్లమెంట్​లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

CONGRESS PROTEST
CONGRESS PROTEST

By

Published : Mar 27, 2023, 12:41 PM IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్ష ఎంపీలు పార్లమెంట్​ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేశారు. నల్లటి వస్త్రాలు ధరించి రాహుల్​కు మద్దతుగా నినాదాలు చేశారు. అదానీ కుంభకోణంపై విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు. విపక్ష ఎంపీలంతా పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లారు. గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఆందోళనల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ నిరసనల్లో పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ అంతం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు. మోదీ తొలుత స్వయం ప్రతిపత్తి సంస్థలను ఆయన అంతం చేశారని.. ఎన్నికల్లో గెలిచినవారిని బెదిరించి ఆ స్థానంలో సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు లొంగనివారి కోసం ఈడీ, సీబీఐలను రంగంలోకి దించుతున్నారని అన్నారు. ఆ విషయాన్ని ఎత్తి చూపేందుకే తామంతా నల్ల వస్త్రాలు ధరించి నిరసన చేస్తున్నామని చెప్పారు.

గాంధీ విగ్రహం ఎదుట సోనియా, ఖర్గే

అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్లమెంట్​లోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఖర్గే, సోనియా అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్​కు.. ఆ పార్టీ ఎంపీలు హాజరయ్యారు. మరోవైపు, కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. టీఎంసీ, బీఆర్ఎస్, సమాజ్​వాదీ, డీఎంకే, వామపక్షాలు ఈ భేటీకి హాజరయ్యాయి. పార్లమెంట్​లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాయి. రాహుల్ గాంధీపై అనర్హత, అదానీ వివాదంపై ఉభయ సభల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంపై సమాలోచనలు జరిపాయి. బడ్జెట్ సమావేశాల్లో విపక్ష పార్టీల మధ్య ఏర్పడ్డ సయోధ్య.. పార్లమెంట్ వెలుపలా కొనసాగాలని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేసింది.

రాహుల్ గాంధీపై అనర్హత వేయడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్​లోనూ ఆందోళనలు కొనసాగించారు విపక్ష ఎంపీలు. అదానీ గ్రూప్​పై విచారణ జరపాలని డిమాండ్లు చేశారు. ఫలితంగా లోక్​సభ మధ్యాహ్నం 4 గంటలకు వాయిదా పడింది. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.

నిరసనలో ఖర్గే, ఇతర విపక్ష పార్టీల ఎంపీలు
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

నల్ల వస్త్రాలతోనే అసెంబ్లీకి
వివిధ రాష్ట్రాల్లోనూ రాహుల్​కు మద్దతుగా ఆందోళనలు కొనసాగాయి. ఒడిశాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నల్ల వస్త్రాలు ధరించి అసెంబ్లీలకు వెళ్లారు. బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుపు వస్త్రాలు ధరించి ర్యాలీలు తీశారు.

ఒడిశా అసెంబ్లీలో నల్లటి వస్త్రాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

'ఎన్నటికీ సావర్కర్ కాలేరు'
మరోవైపు, రాహుల్ గాంధీపై అధికార భాజపా విమర్శలు కొనసాగిస్తోంది. ఓబీసీ వర్గాలను రాహుల్ గాంధీ అవమానించారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తారు. కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ఆయన క్షమాపణలు చెప్పడం లేదని ఆరోపించారు. తాను సావర్కర్ కాదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'ఇప్పుడు ఈ డ్రామా అంతా ఎందుకు చేస్తున్నారు. రాహుల్ ఎప్పటికీ సావర్కర్ కాలేరు. సావర్కర్ ఎన్నడూ ఆరు నెలలు విదేశీ యాత్ర చేయలేదు' అని అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:

​ఫైజల్ అనర్హతపై సుప్రీం విచారణ.. రాహుల్​ గాంధీ కేసుపై ప్రభావమెంత?

రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె.. ఆ వివాదంతో వెలుగులోకి! బాన్సురీ నేపథ్యం ఇదే

ABOUT THE AUTHOR

...view details