Rahul Gandhi London Visit: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. అయితే ఈ పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ ఆమోదం తీసుకోకుండా వెళ్లారని సమాచారం. ఎంపీలు విదేశాలకు వెళ్లే ముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఏ ఎంపీ అయినా.. విదేశీ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో కనీసం మూడు వారాల ముందే ఉంచాలి. ఈ నిబంధనను రాహుల్ గాంధీ పాటించలేదని సమాచారం.
విదేశాల నుంచి నేరుగా ఆహ్వానం ఉంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి రాజకీయ ఆమోదం పొందాల్సి ఉంటుందని బుధవారం ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో గతంలోనే నిబంధనలు రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే వీటిని తిప్పికొట్టింది కాంగ్రెస్ పార్టీ. అధికారిక విదేశీ పర్యటనలు కానప్పుడు ఎంపీలు.. ప్రధాని నుంచో, ప్రభుత్వం నుంచో రాజకీయ పరమైన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించారు. ప్రధాని కార్యాలయం వాట్సాప్ నుంచి వచ్చే సందేశాలను గుడ్డిగా ఫాలో కావద్దంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు.