Sonia Gandhi ED case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియాకు తోడుగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. మరోవైపు సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మహిళా కార్యకర్తలు నల్ల బెలూన్లు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈడీ అధికార దుర్వియోగాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు భాజపా భయపడే ఈడీని పంపిస్తోందని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు Rahul Gandhi national herald case: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు, ఎంపీలు విజయ్‌చౌక్‌లో ఆందోళనలు చేపట్టారు. అక్కడి నుంచి నిరసనలు తెలుపుతూ రాష్ట్రపతి భవన్ వైపు వెళ్తున్న క్రమంలో రాహుల్ సహా 50 మంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖర్గే, కేటీఎస్ తుల్సీ, చిదంబరం, వివేక్ తన్ఖా వంటి సీనియర్లు పోలీసుల అదుపులో ఉన్న నేతల జాబితాలో ఉన్నారు. ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు 'భారత్‌లో పోలీసుల రాజ్యం నడుస్తోంది. మోదీ ఒక రాజులా ప్రవర్తిస్తున్నారు. మేము రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లాలనుకున్నాం. కానీ మమ్మల్ని పోలీసులు అరెస్టు చేశారు.'
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనాయకుడు
'కాంగ్రెస్ ఎంపీలందరూ విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్‌వైపు వెళ్తున్నాం. పోలీసులు బలవంతంగా రాహుల్‌తో సహా పలువురు నాయకులను అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల బస్సులో మమ్మల్ని తరలిస్తున్నారు. ప్రధానమంత్రి, హోం మంత్రికి తెలిసిన ప్రదేశానికి మమ్మల్మి తీసుకెళ్తున్నారు.'
-జైరాం రమేశ్, కాంగ్రెస్ ఎంపీ
కాంగ్రెస్ పార్టీపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శలు గుప్పించారు. 'దోపిడీకి పాల్పడే అర్హత తమకుందని, దానిని ఎవరూ ప్రశ్నించకూడదని కాంగ్రెస్ భావిస్తోంది' అని అన్నారు. గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టాలని ఆ పార్టీ నేతలకు కాంగ్రెస్ లేఖ రాసిందని చెప్పారు. గాంధీ విగ్రహం వద్ద నిరసనలు చేపట్టే అర్హత కాంగ్రెస్‌కు లేదని అన్నారు సంబిత్ పాత్రా.
Congress protest against ED: ఇప్పటికే ఓసారి ఈడీ సోనియాను విచారించింది. ఈనెల 21న జరిగిన విచారణలో సోనియాను ఈడీ సుమారు 25 ప్రశ్నలు అడిగింది. అయితే సోనియా చేసిన విజ్ఞప్తి కారణంగా విచారణను రెండు గంటల్లో ముగించింది. పార్టీ అధినేత్రి విచారణ నేపథ్యంలో ఆ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. పలు చోట్ల నిరసనలు ఉద్ధృతంగా మారాయి. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ ఎంపీలను నిర్బంధించారు. దాదాపు 75 మంది కాంగ్రెస్ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు రాహుల్‌ను సైతం ఈడీ విచారించింది. అప్పట్లో కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుులు ఆందోళనలు చేశాయి.
ఇదీ కేసు..: కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.
ఇవీ చదవండి:ఫోన్ ట్యాపింగ్‌పై ఉపరాష్ట్రపతి అభ్యర్థి సంచలన ఆరోపణలు
'సాహో సైనికా'.. కార్గిల్ అమర వీరులకు ఘన నివాళి