తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్ గాంధీ పిటిషన్​పై నిర్ణయం ఆరోజే.. ఊరట లభిస్తుందా? - రాహుల్ గాంధీ లేటెస్ట్ న్యూస్

పరువు నష్టం కేసులో తనను దోషిగా తేల్చడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్​పై సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న నిర్ణయం వెలువరించనుంది.

rahul gandhi
rahul gandhi

By

Published : Apr 13, 2023, 5:24 PM IST

నేరపూరిత పరువునష్టం కేసులో దోషిగా తేల్చడాన్ని సవాల్ చేస్తూ రాహుల్​గాంధీ దాఖలు చేసిన పిటిషన్​పై సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తన నిర్ణయం చెప్పనుంది. ఇరువర్గాల వాదనలు ఆలకించిన న్యాయస్థానం.. ఈ మేరకు స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ఆర్ఎస్ చీమా.. మోదీ అనేది కులం పేరు కాదని అన్నారు. రాహుల్​కు శిక్ష విధించిన న్యాయమూర్తిని ఎవరో తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. న్యాయమూర్తి కఠిన పదాలు ఉపయోగించడం సరికాదని వాదించారు.

"రాహుల్​కు విధించిన శిక్షలో ఒక్కరోజు తగ్గినా.. అనర్హత వేటు పడదని కోర్టుకు తెలుసు. ఆయన్ను దోషిగా తేల్చి అరగంట వ్యవధిలో అత్యంత కఠినమైన శిక్ష విధించారు. సుప్రీంకోర్టు రాహుల్​ను హెచ్చరించిందని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. సుప్రీం హెచ్చరికలను సైతం పట్టించుకోలేదని కఠిన వ్యాఖ్యలు చేసింది. కానీ, ఆయన ప్రసంగం.. సుప్రీం హెచ్చరికల కన్నా ముందే జరిగింది."
-ఆర్ఎస్ చీమా, రాహుల్ తరఫు న్యాయవాది

పూర్ణేశ్ మోదీ తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ హర్షిత్ తోలియా.. రాహుల్​కు గరిష్ఠ శిక్ష (రెండేళ్లు) విధించడం సరైనదేనని పేర్కొన్నారు. అనర్హతకు సంబంధించిన నిబంధనలకు పక్కాగా ఉన్నాయని గుర్తు చేశారు. దోషిగా తేలినట్లు ఉత్తర్వులు వెలువడిన వెంటనే అనర్హులైనట్లేనని స్పష్టం చేశారు. పటేల్, జైన్ వర్గం మాదిరిగానే.. మోదీ అనేది కూడా ఓ వర్గమేనని ఆయన వాదించారు.

"బహిరంగ సభలో ప్రసంగిస్తున్నాననే విషయం ఆయన(రాహుల్)కు తెలుసు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. ఆయన.. మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తే అది.. ఆ పేరు ఉన్న అందరికీ వర్తిస్తుందనే విషయం తెలియనంత పిల్లాడు కాదు కదా?" అని హర్షిత్ తోలియా కోర్టులో పేర్కొన్నారు.

అంతకుముందు.. ఏప్రిల్ 3న నేరపూరిత పరువు నష్టం కేసులో సూరత్‌ కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 13 వరకు రాహుల్​కు బెయిల్​ను పొడిగించింది. సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. తనను దోషిగా తేల్చడంపై స్టే విధించాలని, జైలు శిక్షను సస్పెండ్‌ చేయాలని ఈ రెండు పిటిషన్లలో కోరారు. అయితే, అవతలి పక్షం వాదనలు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వడం వీలుకాదని కోర్టు వెల్లడించింది. అలాగే పరువునష్టం కేసులో ప్రతివాదులు ఏప్రిల్‌ 10లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

కేసు ఏంటంటే?
2019 లోక్​సభ ఎన్నికల సమయంలో మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్​కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కోర్టును ఆశ్రయించారు. మోదీ పేరు ఉన్నవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ ట్రయల్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పై కోర్టుల్లో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును 30 రోజుల పాటు వాయిదా వేసింది. అనంతరం రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది.

క్రిమినల్ కేసులో దోషిగా తేలిన రాహుల్​పై అనర్హత వేటు పడటం రాజకీయంగా దుమారం రేపింది. రెండేళ్లకు పైగా శిక్ష పడిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం.. రాహుల్ గాంధీ లోక్​సభ సభ్యత్వం రద్దైంది. ఆయనకు కేటాయించిన బంగ్లాను సైతం ఖాళీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. మరి రాహుల్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండనుంది? ఆయనపై పడ్డ అనర్హత వేటు రద్దైయ్యే అవకాశాలు ఉన్నాయా? లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ కేసు ఏం చెబుతోంది అనే వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details