తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ​ పరువు నష్టం కేసులో రాహుల్​కు నోటీసులు.. ఈసారి పట్నా కోర్టులో విచారణ - రాహుల్​ గాంధీకి బిహార్​ కోర్టు సమన్లు

ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీకి నోటీసులు జారీ చేసింది బిహార్​ పట్నా కోర్టు. ఏప్రిల్​ 25న కోర్టు ముందు హాజరుకావాలని పేర్కొంది.

Bihar Patna Court Summons To Rahul Gandhi
రాహుల్​ గాంధీకి బిహార్ పట్నా కోర్టు నోటీసులు

By

Published : Apr 12, 2023, 4:53 PM IST

Updated : Apr 12, 2023, 5:42 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసి వ్యాఖ్యలను తప్పుబడుతూ దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీకి మరోసారి సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసులో ఏప్రిల్​ 25న తమ ముందు విచారణకు హాజరు కావాలని బిహార్​ పట్నా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాహుల్​కు నోటీసులు పంపింది న్యాయస్థానం.

ఈ వ్యవహారంలో బిహార్​కు చెందిన మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ రాహుల్​పై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో భాగంగానే గత నెల 18న ఎంపీ/ఎమ్​ఎల్యేల ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఏప్రిల్​ 12న(ఈరోజు) కోర్టు ముందు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరైన రాహుల్​ తరఫు న్యాయవాదులు.. ప్రస్తుతం రాహుల్​ గాంధీ సూరత్​ కోర్టు కేసులో బిజీగా ఉన్నారని తెలిపారు. ఈ కారణంగా కేసును మరో తేదీన విచారించాలని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన జడ్జి.. కేసును ఏప్రిల్​ 25కు వాయిదా వేశారు.

పరువు తీయడంలో రాహుల్​ సిద్ధహస్థుడు..: పూర్ణేశ్ మోదీ
మరోవైపు పరువునష్టం క్రిమినల్​ కేసులో దోషిగా తేలిన రాహుల్​ గాంధీ పదేపదే కోర్టులను ఆశ్రయించడం తన దురహంకారాన్ని చూపిస్తుందని పిటిషనర్​ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్​ మోదీ ఘాటు విమర్శలు చేశారు. శిక్షపై స్టే విధించాలంటూ రాహుల్​ తరఫు న్యాయవాదులు చేస్తున్న ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు.

తనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడంపై స్టే విధించాలంటూ ఇటీవలే సూరత్​ కోర్టును ఆశ్రయించారు రాహుల్​. ఈ క్రమంలోనే పిటిషన్​ను వ్యతిరేకిస్తున్న పూర్ణేశ్​ మోదీ.. ఇతరుల పరువుకు భంగం కలిగించే విషయాల్లో రాహుల్​ సిద్ధహస్థుడని వ్యాఖ్యానించారు. ఈ కేసులో రాహుల్​ దాఖలు చేస్తోన్న వ్యాజ్యాలతో ఆయనలో ఉన్న చిన్నపిల్లల దురహంకారాన్ని బయటపెడుతున్నారని మోదీ ఎద్దేవా చేశారు. ఇలా చేసి న్యాయస్థానాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

'న్యాయ వ్యవస్థకే పరీక్ష'
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చి, శిక్ష విధించడం.. లోపభూయిష్టం అని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ. భారత న్యాయ వ్యవస్థకు ఇదొక అగ్నిపరీక్ష అని.. తీర్పును సవరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇదే కొలమానం అందరికీ వర్తిస్తే.. భారత దేశ పార్లమెంటు ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలకు చెందిన అనేక మంది సీనియర్ నేతలు దశాబ్దాల తరబడి పార్లమెంటుకు దూరంగా ఉండాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆనంద్ శర్మ.

Last Updated : Apr 12, 2023, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details