ఇటలీ పత్రిక కొరియర్ డెల్లా సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనేక విషయాలను పంచుకున్నారు. ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని 52 ఏళ్ల రాహుల్ గాంధీని అడగ్గా.. ఆ విషయం తనకే విచిత్రంగా ఉందని.. వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదని బదులిచ్చారు. చాలా పనులు చేయాల్సి ఉందన్న రాహుల్.. తనకు పిల్లలు కావాలని ఉందని వ్యాఖ్యానించారు. నానమ్మ ఇందిరాగాంధీకి తానంటే చాలా ఇష్టమని, అమ్మమ్మ పోలా మైనోకు ప్రియాంక గాంధీ అంటే ఎక్కువ ఇష్టమని తెలిపారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3 వేల 500 కిలోమీటర్ల దూరం సాగిన భారత్ జోడో యాత్రకు సంబంధించిన విషయాలను కూడా రాహుల్ ఇటలీ పత్రికతో పంచుకున్నారు. యాత్ర పూర్తయ్యే వరకు గెడ్డం గీసుకోరాదని తాను భావించినట్లు రాహుల్ తెలిపారు. ఇప్పుడు ఆ గెడ్డాన్ని ఉంచాలా లేదా తీసివేయాలా అనేది తాను నిర్ణయించుకోవాల్సి ఉందన్నారు. భారత్‌లో నియంతృత్వం ప్రవేశించిందని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య నిర్మాణాలు కూలిపోతున్నాయని, పార్లమెంట్ సరిగ్గా నడవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతృత్వానికి ప్రత్యామ్నాయ విజన్‌ను విపక్షాలు ప్రతిపాదించగలిగితే ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో ఓడించవచ్చని అన్నారు.
పార్లమెంట్‌లో రెండేళ్లుగా తనను మాట్లాడనివ్వడం లేదని.. తను మాట్లాడటం మొదలు పెట్టగానే మైక్రోఫోన్ ఆఫ్ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. అధికార వికేంద్రీకరణ లేకుండా పోయిందని, పత్రికలకు స్వేచ్ఛలేదని, న్యాయవ్యవస్థ స్వతంత్రాన్ని కోల్పోయిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తులు ప్రతి సంస్థలో చేరి షరతులు పెడుతున్నారని తెలిపారు. ప్రజలు భయపడుతున్నారని, వారికి భవిష్యత్తు కనిపించడం లేదని రాహుల్ అన్నారు. వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓడిపోతారా అనే ప్రశ్నకు ప్రతిపక్షాలన్నీ ఏకమైతే అది వంద శాతం సాధ్యమన్నారు.
జోడోయాత్ర సందర్భంగా అలా..
రాహుల్ గాంధీ.. గతంలోను తన వివాహం విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జోడో యాత్రలో ఉండగా ఓ ఇంటర్యూ సందర్భంగా పెళ్లి గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వివాహానికి తాను వ్యతిరేకం కానే కాదని తేల్చిచెప్పారు. సరైన అమ్మాయి ఎదురైతే తప్పక వివాహం చేసుకుంటాన్నారు. "సమస్య ఏంటంటే నా తల్లిదండ్రులది (రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ) నిఖార్సైన ప్రేమ వివాహం. ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ ఉండేది. దీంతో నా ప్రమాణాలు పెరిగిపోయాయి. నా స్టాండర్డ్స్ చాలా ఎత్తులో ఉంటాయి." అని అన్నారు. తనకు అలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అమ్మాయి కావాలని చెక్ లిస్ట్ ఏమీ లేదని.. కాస్త తెలివైన అమ్మాయి, ప్రేమించే వ్యక్తి అయితే చాలని అన్నారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్చేయండి.
ఇదే జోడో యాత్రలో మరొక ఇంటర్యూలో తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి రాహుల్ వెల్లడించారు. తన నాయనమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీలో ఉన్న లక్షణాలు.. జీవితభాగస్వామిలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఇందిరా గాంధీని తనకు రెండో తల్లిగా అభివర్ణించారు. ఈ పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్చేయండి.