తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​లో 40లక్షల కరోనా మరణాలు- కేంద్రమే కారణం!'

Rahul Gandhi comments on covid: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా విజృంభణ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే దేశంలో 40 లక్షల మంది భారతీయులు మరణించారని ఆరోపించారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.4లక్షల పరిహారం అందించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు.

రాహుల్ గాంధీ
rahul gandhi

By

Published : Apr 17, 2022, 4:39 PM IST

Rahul Gandhi comments on covid: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా మహమ్మారి సమయంలో 40 లక్షల మంది భారతీయులు మరణించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కొవిడ్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్త కొవిడ్‌ మరణాల వివరాలను బహిర్గతం చేయాలన్న డబ్ల్యూహెచ్‌ఓ ప్రయత్నాలకు భారత్‌ అడ్డుపడుతోందంటూ 'న్యూయార్క్‌ టైమ్స్‌'లో ప్రచురితమైన కథనాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

"మోదీ జీ నిజాలు మాట్లాడరు. ఇతరులను మాట్లాడనివ్వరు. ఆక్సిజన్ కొరత వల్ల ఎవరూ చనిపోలేదని మాత్రం అబద్ధాలు చెబుతారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కొవిడ్ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఐదు లక్షలు కాదు.. 40 లక్షల మంది భారతీయులు మరణించారు. మహమ్మారి​తో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వండి"

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం ఆదివారం వరకు దేశంలో 5,21,751 మంది కొవిడ్​తో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. దేశంలో కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్యను లెక్కించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుసరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రశ్నించింది. జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను వర్తింపజేయడంలో ఔచిత్యాన్ని తప్పుబట్టింది. ఇదే అంశంపై తాజాగా 'న్యూయార్క్‌ టైమ్స్‌' ప్రచురించిన కథనాన్ని ఖండించింది. కొన్ని దేశాలకు అనుసరిస్తున్న విధానాన్ని భారత్‌కూ వర్తింపజేయడం తగదని పేర్కొంది. అయితే, తమ అభ్యంతరం ఫలితాల గురించి కాదనీ, దానికి అనుసరిస్తున్న విధానాన్నే తప్పు పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:'కుట్ర ప్రకారమే శోభా యాత్ర వేళ ఘర్షణలు.. పోలీసులు అలర్ట్'

ABOUT THE AUTHOR

...view details