Rahul gandhi comments: దేశం ఇదివరకు ఐక్యంగా ఉండేదని కానీ ఇప్పుడు అంతర్గతంగా వివిధ దేశాలుగా విడిపోయిందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత్‌లో వేర్వేరు వర్గాలుగా ఈ విభజన.. హింసకు దారి తీస్తోందని చెప్పుకొచ్చారు. గత 2-3 ఏళ్లగా భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై వాస్తవాలను మీడియా సహా భాజపా, ఆర్ఎస్ నేతలు కప్పిపుచ్చుతున్నారని, త్వరలోనే ఆ నిజం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. శ్రీలంక, ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులు త్వరలో భారత్‌లో కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేత శరద్ యాదవ్‌తో దిల్లీలో భేటీ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"డొనెస్క్, లుహాన్స్క్ ప్రాంతాలు ఉక్రెయిన్‌కు చెందవని రష్యా వాదిస్తోంది. ఈ కారణంతోనే రష్యా దాడి చేస్తోంది. చైనా కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది. లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం కావని వాదిస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో బలగాలను మోహరించింది. కానీ ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వం వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది."
-రాహుల్ గాంధీ