Rahul Gandhi attacks government: పార్లమెంట్‌ను సవ్యంగా నడిపించటం ప్రభుత్వం బాధ్యతని నొక్కి చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే.. విపక్షాలు లేవనెత్తిన ప్రజాప్రయోజన అంశాలపై చర్చ చేపట్టాలని సవాల్ చేశారు. ధరల పెరుగుదల, లఖింపుర్ ఖేరి ఘటన సహా ఇతర అంశాలపై చర్చకు అనుమతించకపోటవాన్ని తప్పుపట్టారు రాహుల్.
"వారు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారు. నిరంతరం దాడి జరుగుతోంది. అందుకే మేము పోరాటం చేస్తున్నాం. పార్లమెంట్‌ను ఎలా నిర్వహించాలో తెలియని ప్రభుత్వం ఇది. ధరల పెరుగుదల, లఖింపుర్, ఎంఎస్పీ, లద్దాఖ్, పెగసస్, ఎంపీల సస్పెన్షన్ వంటి అంశాలను లేవనెత్తకుండా మమ్మల్ని నిలువరించలేరు. మీకు ధైర్యం ఉంటే.. చర్చకు అనుమతించండి. లఖిపుర్పై చర్చ చేపట్టాలి. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలి."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలనే అంశాన్ని లేవనెత్తాలనుకుంటున్నాని, అందుకు ప్రభుత్వం అనుమతించటం లేదని ఆరోపించారు రాహుల్. లద్దాఖ్ ప్రజలు భయపడొద్దని, మీ ఆస్తి మీకే చెందుతుందని పేర్కొన్నారు.
ఖర్గే ఆరోపణలు..
విపక్షాల ఆందోళనలకు ఓ పరిష్కారం కనుగొనేందుకు రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎంపీల పార్టీలతో చర్చిస్తామని కేంద్రం పేర్కొనటాన్ని తప్పుపట్టారు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే. వారు విపక్ష పార్టీలను విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు.
" 15-16 పార్టీలు సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. వారు కేవలం 5 పార్టీలను చర్చలకు పిలిచి మమ్మల్ని విడదీస్తున్నారు. వారికి ఈ విభజించు-పాలించు సూత్రం బ్రిటీష్ వాళ్లు ఇచ్చారు. వారికి మాట్లాడేందుకు ఏమీ లేనప్పుడే ఇలాంటివి చెబుతారు. అది చాలా చౌకబారు ప్రకటన. అలాంటి ప్రకటనతో ఏ పార్టీ బలహీనపడదు. తప్పు చేశామని ముందుగా వారు అంగీకరించాలి. నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేశారా? నింబధనలు ఉల్లంఘించి సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని చెబుతున్నాం. దాంట్లో తప్పు ఏమి ఉంది? "
- మల్లికార్జున్ ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత.