Rahul ED: నేషనల్ హెరాల్డ్ కేసు దేశ రాజధాని దిల్లీలో వరుసగా మూడో రోజూ సెగలు పుట్టించింది! ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం 8 గంటలకు పైగా ప్రశ్నించారు. యంగ్ ఇండియన్ కంపెనీ కార్యకలాపాలు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తులు సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఆయన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రూపంలోనూ భద్రపర్చారు. మళ్లీ శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మరోవైపు- రాహుల్‌పై విచారణ నేపథ్యంలో హస్తం పార్టీ హస్తినలో చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. తమ ప్రధాన కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించారని.. నాయకులు, కార్యకర్తలను చితకబాదారని కాంగ్రెస్ ఆరోపించింది. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదుకు డిమాండ్ చేసింది. వారి చర్యకు నిరసనగా దేశవ్యాప్తంగా గురువారం రాజ్భవన్లను ఘెరావ్ చేయనున్నట్లు తెలిపింది. ఆ పార్టీ ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు.
మీ పాత్ర ఏంటి? :ఈడీ వర్గాల సమాచారం ప్రకారం.. నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యకలాపాలు, దాని యాజమాన్య సంస్థగా ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీ ఏర్పాటు, ఏజేఎల్‌కు కాంగ్రెస్ ఇచ్చిన రుణం తదితర అంశాలకు సంబంధించి వరుసగా మూడో రోజూ అధికారులు రాహుల్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయా వ్యవహారాల్లో ఆయన వ్యక్తిగత పాత్ర గురించి అడిగారు. ఏజేఎల్‌కు ఉన్న దాదాపు రూ.800 కోట్ల ఆస్తుల గురించి ప్రశ్నలు సంధించారు. లాభాపేక్ష లేని కంపెనీ అయిన యంగ్ ఇండియన్ భూములు, భవనాలను అద్దెకివ్వడం వంటి వాణిజ్య కార్యకలాపాలను ఎలా చేపడుతోందనీ ఆరా తీశారు. కోల్‌కతాలోని ఓ కంపెనీ నుంచి 2011 ఫిబ్రవరిలో యంగ్ ఇండియన్ తీసుకున్న రూ.కోటి రుణం గురించి అడిగారు. రాహుల్ వాంగ్మూలాలను వీడియో, ఆడియో రికార్డింగ్ రూపంలో భద్రపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎ4 సైజు పేపర్లపైనా టైప్ చేస్తున్నట్లు చెప్పారు. సంబంధిత ప్రతులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే రాహుల్ వాటిపై సంతకం చేసి దర్యాప్తు అధికారికి అందజేస్తున్నారని వివరించారు. మరోవైపు- కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌లకు ఈడీ సమన్లు పంపిన నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో ఇంతవరకూ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని కాంగ్రెస్ పేర్కొంది. దానిపై ఈడీ అధికారులు స్పందిస్తూ.. ఈ కేసులో ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకున్న సంగతిని గుర్తుచేశారు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్-120బి (నేరపూరిత కుట్ర), సెక్షన్-420 (మోసం)లను అందులో ప్రయోగించారని తెలిపారు. తీవ్రమైన నేరాల విషయంలోనే వాటి కింద కేసు నమోదు చేస్తారని, అందుకే తాము పీఎంఎల్ఏ కేసు నమోదుచేశామని వివరించారు. యంగ్ ఇండియన్ లాభాపేక్ష లేని కంపెనీ అని, అందులో ఎవరికీ వ్యక్తిగత నిధులు/వాటాలు ఉండవని గతంలో రాహుల్ చెప్పిన సంగతిని గుర్తుచేశారు.
అట్టుడికిన ఏఐసీసీ ప్రధాన కార్యాలయం :రాహుల్‌పై ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ నిరసనల సందర్భంగా దిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతలు తలెత్తాయి. కొంతమంది పోలీసులు బలవంతంగా తమ కార్యాలయంలోకి ప్రవేశించారని.. లాఠీఛార్జి చేసి పార్టీ నేతలు, కార్యకర్తలను చితకబాదారని కాంగ్రెస్ ఆరోపించింది. మహిళా కార్యకర్తలతోనూ దురుసుగా ప్రవర్తించారంటూ మండిపడింది. అక్రమంగా లోపలికి చొచ్చుకొచ్చిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది. వారిని సస్పెండ్ చేయాలని, ఇతర క్రమశిక్షణ చర్యలను ప్రారంభించాలని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం, దిల్లీ పోలీసుల రౌడీయిజం పరాకాష్ఠకు చేరుకుందని వ్యాఖ్యానించారు. గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్న తమను అదుపులోకి తీసుకోవడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ''మోదీ ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా మారిన పోలీసు అధికారులను మేం ఊరికే వదిలిపెట్టబోం. ఇప్పుడు చేస్తున్నవన్నీ గుర్తుంచుకుంటాం. వారిపై తగిన చర్యలు చేపడతాం'' అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియోను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మరోవైపు- ఈడీ కార్యాలయం పరిసరాల్లో నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా నిరసనలకు దిగిన వందల మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాణికం ఠాగూర్, అమర్ సింగ్, జయకుమార్ విజయ్ వసంత్, ఎ.చెల్ల కుమార్ తదితర కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు సముదాయంలో నిరసన చేపట్టారు.
అవన్నీ ఆరోపణలే: దిల్లీ పోలీసులు :కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి కొంతమంది పోలీసు సిబ్బంది ప్రవేశించారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. ''నిషేధాజ్ఞల నేపథ్యంలో నిరసన ర్యాలీ జరగకుండా అడ్డుకోవాలనుకున్నాం. ఏఐసీసీ కార్యాలయం గేటు మూసేసేందుకు మేం ప్రయత్నించాం. ఆ ప్రక్రియలో కొంత ఘర్షణ చోటుచేసుకున్న మాట వాస్తవం. అంతేగానీ ఏఐసీసీ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు మేం ప్రయత్నించలేదు'' అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.