Rahul Gandhi foreign trip: 2022లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి రాజకీయ పార్టీలు. భారీ ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇలాంటి కీలక సమయంలో విదేశాలకు పయనమయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బుధవారం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు కూడా రాహుల్ విదేశానికి వెళ్లారు. సరిగ్గా ఒక్క రోజు ముందు తిరిగివచ్చారు.
అయితే రాహుల్ విదేశీ పర్యటన వ్యక్తిగత విషయమని, త్వరలోనే తిరిగి వస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. భాజపా దీనిపై దుష్ప్రచారం చేయొద్దని సూచించారు. కానీ రాహుల్ ఎక్కడకు వెళ్లారు, ఎప్పుడు తిరిగి వస్తారు అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
Assembly elections 2022
ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంబాజ్‌లో రాహుల్ జనవరి 3న బహిరంగ సభకు రాహుల్ హాజరుకావాల్సి ఉంది. కానీ విదేశీ పర్యటన కారణంగా అది జనవరి 15కు వాయిదా పడింది. ప్రచారం ఆలస్యం కావడం వల్ల ఆ ప్రభావం కాంగ్రెస్ విజయావకాశాలపైనా పడే అవకాశం ఉంది.
రాహుల్ ప్రచారం ఆలస్యం చేయడం వల్ల భాజపాకు మరింత అవకాశం ఇచ్చినట్లయింది. జనవరి మొదటి వారంలోనే ఆ పార్టీ కూడా పంజాబ్‌లో పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని ఇప్పటికే ప్రణాళికలు వేసింది. జనవరి 5న ప్రధాని నరేంద్ర మోదీతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. సాగు చట్టాలు ఉపసంహరించుకున్న తర్వాత మోదీ తొలిసారి పంజాబ్ పర్యటనకు వెళ్తున్నారు.