Rahul Flying Kiss Video Parliament :కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారన్న ఆరోపణలు దుమారం రేపాయి. సభలో ఇలాంటి చర్య ఎప్పుడూ చూడలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. మహిళా వ్యతిరేకులు మాత్రమే ఇలాంటి పని చేయగలరని ధ్వజమెత్తారు. ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ మహిళా ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిశారు. రాహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్‌కు చేసిన ఫిర్యాదులో 20 మంది మహిళా ఎంపీలు సంతకాలు చేశారు. 'కాంగ్రెస్ సభ్యుడు సభలో మాట్లాడుతూ స్మృతి ఇరానీవైపు అనుచిత సంజ్ఞలు చేశారు' అని ఫిర్యాదులో మహిళా ఎంపీలు ఆరోపించారు.
Rahul Flying Kiss Row :అవిశ్వాస తీర్మానంపై రాహుల్ మాట్లాడిన తర్వాత.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రసంగించారు. రాహుల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. "నా కన్నా ముందు మాట్లాడిన వ్యక్తి అసభ్య సంజ్ఞ చేశారు. మహిళా వ్యతిరేకులు మాత్రమే మహిళా ఎంపీలు ఉండే పార్లమెంట్‌కు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు. ఆ (గాంధీ) కుటుంబ సంస్కృతిని దేశమంతా చూసింది" అని ఇరానీ మండిపడ్డారు.
మరోవైపు, బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సైతం రాహుల్‌పై విమర్శలు చేశారు. "స్మృతి ఇరానీ వైపు, అందరు మహిళా సభ్యులు ఉన్నవైపు చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇది అనుచితమే కాదు.. అసభ్యకరం కూడా. పార్లమెంట్ చరిత్రలో ఇలాంటిది ఎన్నడూ జరగలేదని సీనియర్ ఎంపీలు చెబుతున్నారు. కాబట్టి దీనిపై మేం స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం. సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించి ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం" అని కరంద్లాజే వివరించారు.
Rahul Flying Kiss in Lok Sabha Video :
పార్లమెంట్.. ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చే ప్రదేశమా? అంటూ బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. మహిళా ఎంపీలు కూర్చున్న చోట అలాంటి పని చేయడం అవమానకరమంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం తమ సంస్కృతికి వ్యతిరేకమని కేంద్ర మంత్రి దర్శనా జర్దోశ్ పేర్కొన్నారు. అలాంటి చర్యలను సహించే ప్రసక్తే లేదన్నారు.
Rahul Gandhi Hug to Modi : రాహుల్ తన ప్రసంగం పూర్తయ్యాక ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. పార్లమెంట్లో గత అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన ఘటనను పలువురు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎన్డీఏ సర్కారుపై 2018లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఉద్వేగంగా మాట్లాడిన రాహుల్.. ప్రసంగం పూర్తైన తర్వాత మోదీ వద్దకు వెళ్లి ఆయనన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత తన సీటులో కూర్చొని సహచర ఎంపీకి కన్ను కొట్టారు. ఇది అప్పట్లో తీవ్ర దుమారానికి దారి తీసింది.