Rahul Defamation Case : పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులోనూ చుక్కెదురైంది. తనకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడించిన కోర్టు.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సమర్ధించింది.
"రాహుల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో ఆయనకు కిందికోర్టు శిక్ష విధించడం సరైనదే, న్యాయపరమైనదే. ఈ శిక్షను నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు కన్పించట్లేదు. అందుకే పిటిషనర్ అభ్యర్థనను కొట్టివేస్తున్నాం" అని జస్టిస్ హేమంత్ ప్రచక్ తీర్పు వెలువరించారు. ఈ తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ హేమంత్ ప్రచ్ఛక్ పేర్కొన్నారు.
'సుప్రీంకు వెళ్తాం..'
గుజరాత్ హైకోర్టు నిర్ణయంపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్తారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. "రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పును అధ్యయనం చేస్తాం. అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తాం. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. న్యాయమే విజయం సాధిస్తుంది. ఈ పోరాటంలో ప్రతి దేశభక్తి గల భారతీయుడు రాహుల్‌కు మద్దతుగా నిలుస్తాడు" అంటూ వేణుగోపాల్ ట్వీట్ చేశారు.
'నిరాశ కలిగించింది కానీ ఊహించనిదే'
రాహుల్‌గాంధీ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేయడం చాలా నిరాశ కలిగించిందని.. కానీ ఊహించిందే జరిగిందని రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ అన్నారు. నోట్ల రద్దు, చైనాకు క్లీన్ చిట్, కష్టాల్లో కూరుకుపోతున్న దేశ ఆర్థిక పరిస్థితిపై రాహుల్ నిజాలు మాట్లాడినందుకే బీజేపీ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టుపై ఉన్న విశ్వాసంతో అక్కడికి వెళ్తామని తెలిపారు.
'బీజీపీ 'రాజకీయ కుట్ర'కు భయపడం!'
రాహుల్ స్టే పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. అధికార బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ 'రాజకీయ కుట్ర'కు ఏ పార్టీ నాయకుడు కూడా భయపడడం లేదని ఆయన అన్నారు. చట్టబద్ధంగా, రాజకీయంగా పోరాడతామని తెలిపారు.
"రాహుల్ గాంధీ.. సత్యం కోసం పోరాడారు. భవిష్యత్తులోనూ పోరాడుతూనే ఉంటారు. పరారీలో ఉన్న లలిత్ మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా తదితరులు మోదీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉన్నారు. అవినీతిపై మోదీ జీ ద్వంద్వ ప్రమాణాలు అందరికీ తెలుసు. సత్యమేవ జయతే" అంటూ ఖర్గే ట్వీట్ చేశారు.
'దుర్భాషలాడడం, పరువు తీయడం రాహుల్‌కు బాగా అలవాటు'
పరువు నష్టం కేసులో రాహుల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. దుర్భాషలాడడం, పరువు తీయడం రాహుల్‌కు అలవాటు అని ఆరోపించింది. కనీసం రాహుల్ క్షమాపణలు చెప్పడానికి కూడా నిరాకరించారని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. రాహుల్‌పై ఎనిమిది పరువు నష్టం కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ వ్యక్తులు, సంస్థలను దుర్వినియోగం చేయడం రాహుల్‌కు అలవాటుగా మారిందని, సావర్కర్ వంటి గొప్ప దేశభక్తుడిని రాహుల్ అవమానించారని ఆరోపించారు.
"రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నియంత్రించలేకపోతోంది? సరిగ్గా మాట్లాడటానికి శిక్షణ ఎందుకు ఇవ్వలేదు?.. క్షమాపణ చెప్పడానికి సూరత్‌లోని ట్రయల్ కోర్టు అవకాశం ఇచ్చినప్పుడు 'నేను క్షమాపణ చెప్పే సావర్కర్‌ను కాను' అని రాహుల్ అన్నారు. గొప్ప దేశభక్తుడిపై రాహుల్‌కు ఎంత ద్వేషం ఉందో అప్పుడే తెలిసింది" అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.
ఇదీ వివాదం...
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. కర్ణాటకలోని కోలార్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దీనిపై గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ.. సూరత్ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు తీర్పును పైకోర్టులో సవాల్ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు కూడా ఇచ్చింది. అప్పటి వరకు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారని లోక్‌సభ సచివాలయం గుర్తు చేసింది.
అనంతరం సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు రాహుల్ గాంధీ. తన రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని కోర్టును కోరారు. దాంతోపాటు తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును కూడా నిలిపివేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన సూరత్ సెషన్స్ కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న ఇరు పక్షాల వాదనలు విని.. ఏప్రిల్ 20న తీర్పు వెలువరించింది. రాహుల్‌పై విధించిన శిక్షపై స్టే విధించేందుకు తిరస్కరించింది. అనంతరం దాన్ని కూడా సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు రాహుల్. అనంతరం శుక్రవారం రాహుల్ పిటిషన్‌ను కొట్టివేసింది గుజరాత్ హైకోర్టు.