వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులకు మద్దతిస్తున్న సెలబ్రిటీలతో సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులపై విమర్శలు గుప్పించింది భాజపా. భారత్‌కు వ్యతిరేకంగా నకిలీ కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. 'భారత్ వ్యతిరేక ప్రచారం, నకిలీ కథనాలను ఎదుర్కొవడానికి మేమంతా ఏకమవుతాం' అని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమనాస్త్రానాలు సంధించారు మరో భాజపా నాయకుడు సంబిత్ పత్రా. దేశాన్ని వివాదాల్లోకి లాగే అంశాలతోనే రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఆరోపించారు.
వారే రాహుల్‌కు మద్దతుదారులు
"భారత్ పరువు ఎలా తీయాలి? దేశాన్ని వివాదాల్లోకి ఎలా లాగాలి? అనే భారత వ్యతిరేక అంశాలతో కుట్ర చేయడానికి రాహుల్ విదేశాలకు వెళ్తున్నారు" అని ఆరోపించారు. అంతర్జాతీయ పాప్‌సింగర్ రిహన్న, మాజీ అడల్ట్ నటి మియా ఖలీఫా సహా భారత్ వ్యతిరేక ప్రచార ట్వీట్లు చేసినవారే రాహుల్‌తో మద్దతుగా నిలుస్తారని విమర్శించారు పత్రా. రాహుల్ తన రాజకీయ ప్రయోజనాల కోసం రైతు నిరసనలను ఉపయోగించుకుంటున్నారని.. ప్రజలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని రాజకీయాలు చేయవద్దని రైతులు పేర్కొన్నప్పటికీ పరిపక్వత లేని రాహుల్.. వారి తరఫున మాట్లాడటానికి ప్రయత్నిస్తునారని అన్నారు.
నియంతల పేర్లు 'ఎం' అక్షరంతో ఎందుకు మొదలవుతాయని రాహుల్ చేసిన ట్వీట్‌పై విరుచుకుపడ్డారు పత్రా. మన్మోహన్ సింగ్, మహాత్మా గాంధీ పేర్లు కూడా 'ఎం' తోనే ప్రారంభమవుతాయన్నారు.
ఇదీ చూడండి:రైతులకు మద్దతుగా సీజేఐకి 141మంది లాయర్లు లేఖ