భారత్-చైనా సరిహద్దు వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై ముప్పేట దాడికి దిగారు. పొరుగు దేశం చైనా చేస్తున్న అరాచకాలను చూసి భయపడుతున్నారని ఆరోపించారు. అందుకే డ్రాగన్ బలగాలు సరిహద్దులు దాటి మన దేశంలోకి వచ్చాయని విమర్శించారు. లద్దాఖ్ ప్రతిష్టంభనకు ముందు.. 2017లో డోక్లాంలో కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. చూస్తూ ఊరుకుంటే చైనా ఇంకా తెగించే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
"భారత్‌లోని కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టిన చైనా.. వాటిని ఆక్రమించింది. తొలుత డోక్లాంలో అనుకున్న విధంగా తన వ్యూహాన్ని అమలు చేసింది. భారత్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం చూసి లద్దాఖ్‌లో, ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొచ్చుకువచ్చింది. ప్రధాని భయం కారణంగా మనం కోల్పోయిన భూభాగం కొంత కూడా తిరిగి రాదు. అది మోదీకి కూడా తెలుసు. కానీ నటిస్తున్నారు. "