తెలంగాణ

telangana

By

Published : Nov 28, 2022, 7:26 AM IST

ETV Bharat / bharat

3500 మంది రైతులకు శిక్షణ.. 200 రకాల విత్తనాల ఉత్పత్తి.. అందుకే 'ఆమె'కు పద్మశ్రీ!

అక్షరం ముక్క రాదు.. ఆస్తులు అంతకన్నా లేవు అయితేనేం.. ఆమె నింపిన స్ఫూర్తి.. వేలమందిని సేంద్రియ సాగు బాటలో నడిపిస్తోంది. దేశవాళీ విత్తనాల భవిష్యత్తుకి భరోసా కల్పిస్తోంది. అందుకే రాహీబాయి సోమ్‌ పోపెరేకు పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది భారత ప్రభుత్వం. ఆమె విజయ ప్రస్థానాన్ని ఓ సారి తెలుసుకుందాం.

Etv Bharat
Etv Bharat

రాహీబాయి సోమ్‌ పోపెరేది మహారాష్ట్రలోని అహ్మద్‌ నగర్‌ జిల్లాలోని అకోలే అనే గిరిజన గ్రామం. తండ్రి మహదేవ్‌ కోలి నిరుపేద గిరిజన రైతు. ఐదుగురు అక్క చెల్లెళ్లలో రాహీబాయి ఒకరు. చిన్నప్పటి నుంచీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి తహతహలాడే ఆమెకు చదువుంటే చాలా ఇష్టం. కానీ, పేదరికం ఆమెను బడికి వెళ్లనివ్వలేదు. దాంతో అమ్మానాన్నలకు చేదోడు వాదోడుగా ఉంటూ.. పదేళ్ల వయసులోనే వ్యవసాయ పనులకు వెళ్లేది.

పట్టుమని పన్నెండేళ్లు రాలేదు.. కానీ, ఆర్థిక ఇబ్బందులూ, కుటుంబ పరిస్థితుల వల్ల ఆ ఊరికే చెందిన సోమ్‌ పోపెరే అనే రైతుతో రాహీబాయికి పెళ్లి చేశారామె కుటుంబ సభ్యులు. భర్త కుటుంబానికీ వ్యవసాయమే ఆధారం. దాంతో నెమ్మదిగా కుటుంబ బాధ్యతలను ఒంటపట్టించుకున్నారామె. వ్యవసాయ పనులు చేస్తూ క్రమంగా సాగులో లోటు పాట్లను అర్థం చేసుకున్నారు. పంటపొలాన్నే పాఠశాలగా మార్చుకుని ప్రయోగాలెన్నో చేశారు. ఆ సమయంలోనే అనేక అనారోగ్యాలకు హైబ్రిడ్‌ విత్తనాలూ, రసాయనిక ఎరువులూ, మందులే కారణమని గ్రహించారు. అప్పటి నుంచి సేద్యం సంప్రదాయ పద్ధతుల్లోనే చేయాలని నిర్ణయించుకున్నారు.

రాహీబాయి సోమ్‌ పోపెరే

200 రకాల విత్తనాలు..
రాహీబాయి.. తాను సేంద్రియ సాగు చేయడమే కాదు.. ఇతరులకూ ఇందులో మెలకువలు నేర్పించడం, దేశవాళీ విత్తనాలను భద్రపరచడం మొదలుపెట్టారు. ఇందుకోసమే ప్రత్యేకంగా చిక్కుడు, వరి, కూరగాయలు, ఔషధ మొక్కల కోసం ఓ నర్సరీని అభివృద్ధి చేశారు. ఓ ఎన్జీవో సహకారంతో తన ఇంటి పరిసరాలలో దాదాపు 200 రకాల దేశవాళీ విత్తనాలతో కూడిన విత్తన భాండాగారాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జెర్మ్‌ప్లాజమ్‌ అనే సరికొత్త విత్తన పరిరక్షణ సౌకర్యాన్ని కూడా ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల రైతులకూ, స్వయం సహాయక బృందాలకు వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

అందుకే అప్పటి నుంచి రాహీబాయి బీజ్‌ మాత (సీడ్‌ మదర్‌)గా ప్రసిద్ధి చెందారు. అంతేకాదు.. పంటల ఎంపిక, సుస్థిర వ్యవసాయం కోసం సేంద్రియ పద్ధతులూ, తెగుళ్ల నిర్వహణ వంటి విషయాలపై పట్టు తెచ్చుకున్న ఆమె.. అక్షరం ముక్క రాకపోయినా.. రైతులకూ, వ్యవసాయ విద్యార్థులకూ పాఠాలు చెబుతున్నారు. ఇలా ఇప్పటి వరకూ కనీసం 3500 మందికిపైగా రైతులు శిక్షణ పొందారు. అంతేకాకుండా భూగర్భ జలాల నిర్వహణ, చెరువుల పునర్నిర్మాణం వంటివాటి ద్వారా.. పంటలకు నీటి వసతి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆమెకు 2020లో కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి సత్కరించింది.

ABOUT THE AUTHOR

...view details