సీనియర్లన్న అహంకారంతో కొందరు విద్యార్థులు రెచ్చిపోతున్నారు. ర్యాగింగ్ పేరుతో జూనియర్లతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాము చెప్పినట్టు వినకుంటే ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఈ తరహా ఘటనే దేశ రాజధాని దిల్లీలో జరిగింది. నోయిడాలోని జేఎస్‌ఎస్ కళాశాలలో జరిగిన ఈ ర్యాగింగ్ ఉదంతం వారం రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమను 'సార్' అని పిలవనందుకు ఓ జూనియర్ విద్యార్థిపై దాడి చేసి అతడి భుజంలోని ఎముకని విరగొట్టారు కొందరు సీనియర్ విద్యార్థులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నోయిడాలోని జేఎస్‌ఎస్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి డిసెంబర్ 7న రాత్రి తన హాస్టల్‌లో చదువుతున్నాడు. అతడి రూమ్‌మేట్‌కు కాల్ చేసిన సీనియర్ విద్యార్థులు.. జూనియర్‌ను తమ రూమ్‌కు పంపమని చెప్పారు. ఈ క్రమంలోనే రూమ్‌కు వెళ్లిన జూనియర్‌ను వాళ్ల అసైన్‌మెంట్ పూర్తి చేయమని అడిగారు. అప్పటికే సీనియర్లు రూమ్‌లో మద్యం తాగుతూ ఉన్నారని జూనియర్ విద్యార్థి చెప్పాడు. అసైన్‌మెంట్ చేయడానికి జూనియర్ విద్యార్థి నిరాకరించాడు. దీంతో కోపం తెచ్చుకున్న సీనియర్ విద్యార్థులు మద్యం మత్తులో అతడితో అసభ్యకరంగా మాట్లాడుతూ దాడికి దిగారు. సార్ అని పిలవాలని జూనియర్ విద్యార్థిని బెదిరించారు.
కాలేజీ రిజిస్ట్రార్ తన తండ్రి స్నేహితుడంటూ మరో సీనియర్ బెదిరించాడు. అనంతరం భయపడ్డ జూనియర్ తర్వాత తన గదికి వెళ్లిపోయాడు. కాసేపటికి జరిగిన విషయంపై సెక్యూరిటీ గార్డుకు ఫిర్యాదు చేశాడు. దీంతో కోపోద్రిక్తులైన సీనియర్ విద్యార్థులు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో జూనియర్‌ను మళ్లీ తమ రూమ్‌కు రావాలని ఫోన్ చేశారు. బాధితుడు రాను అని తెలిపాడు. కాసేపటికి సీనియర్ విద్యార్థులే జూనియర్ ఉండే రూమ్‌కు వచ్చి లోపలి నుంచి తలుపుకు తాళం వేశారు. తమ గదికి పిలిస్తే ఎందుకు రాలేదని జూనియర్‌ను సీనియర్లు ప్రశ్నించారు.