తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారతావనిని ఏకతాటిపైకి తెచ్చిన మహోగ్ర ఉద్యమం - క్విట్ ఇండియా

గాంధీజీ పిలుపిచ్చిన క్విట్‌ ఇండియా ఉద్యమం ఆయన విధానాలకు వ్యతిరేకంగా ఊహించని రీతిలో సాగింది. నాయకులు లేకపోవటం వల్ల కట్టలు తెగిన ప్రవాహంలా ఉవ్వెత్తున సాగింది. దశాదిశ నిర్దేశించే వారు లేకపోవటంతో 'డూ ఆర్‌ డై' అన్న నినాదం భారతీయలు మనోభావాలను తట్టిలేపింది. బ్రిటీష్ వారి పాలన నుంచి ఎలాగైనా విముక్తి పొందాలన్న స్వాతంత్ర్యకాంక్ష హింసాత్మక రూపు దాల్చింది. దమననీతితో ఉద్యమాన్ని అణిచివేసినా.. నాటిపోరు భవిష్యత్‌ చిత్రాన్ని బ్రిటీష్ పాలకుల కళ్లముందుంచగలిగింది. తక్షణ స్వాతంత్ర్యం కోరుతున్న భారత ప్రజల డిమాండ్‌ను ఎప్పటికైనా నెరవేర్చక తప్పని పరిస్థితిని కల్పించింది.

QUIT INDIA EFFECTS
క్విట్ ఇండియా ప్రభావం

By

Published : Aug 8, 2021, 10:31 AM IST

Updated : Aug 8, 2021, 10:38 AM IST

'భారత్‌ ఛోడో' ఉద్యమం ఉద్ధృతంగా సాగినా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవటానికి కారణాలెన్ని ఉన్నప్పటికీ ఉద్యమ ప్రభావం మాత్రం స్పష్టంగా కనిపించింది. అప్పటివరకూ సత్యాగ్రహం, సహాయ నిరాకరణ పేరుతో సాగినపోరాటం క్విట్ ఇండియా పిలుపుతో రూపు మార్చుకుంది. ఉద్యమానికి సంబంధించి పోరాటం అహింసతోపాటు హింసాత్మకంగా మారటానికి కారణం ప్రధానమైన నాయకులంతా జైళ్లలో ఉండటం. నిరసనలకు దిగిన వారు తమ వ్యతిరేకతను తెలియజేసేందుకు ఇష్టారీతిలో వ్యవహరించారు.

వాస్తవానికి క్విట్‌ ఇండియా ఉద్యమం మొదటి దశలో కేవలం కేవలం హర్తాళ్లు, నిరసనలు ర్యాలీలే ఉండేవి. తెల్లదొరల నిరంకుశ ధోరణి కారణంగా రెండోదశలో ప్రభుత్వ భవనాలు, పురపాలక సంఘాలు పోస్టల్, రైల్వే ఆస్తులపై దాడులు జరిగాయి. మూడో దశలో పోలీస్‌ స్టేషన్లనే లక్ష్యం చేసుకున్నారు. దక్షిణాదిన హింస మరింత ప్రజ్వరిల్లింది. ఇక్కడ విద్యార్థులు, యవత పెద్దసంఖ్యలో ఉద్యమంలో పాలుపంచుకున్నారు. తర్వాత తీవ్రత తగ్గినా.. 1944 మేలో మహాత్మా గాంధీని జైలు నుంచి విడుదల అయ్యేంతవరకూ ఉద్యమం సాగింది.

తెల్లదొరల అణచివేత..

నాటి తెల్లదొరల ప్రభుత్వం క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణిచివేసింది. 1943 చివరకు ఉద్యమం నీరు గారినా... చాలామంది ఉద్యమకారులను 1945వరకు జైళ్లలోనే మగ్గేలా చేసింది. కొన్నివారాల పాటు కొనసాగిన ఆందోళనలు కొన్నిప్రాంతాలపై బ్రిటీష్‌ వారి పట్టు తప్పేలా చేశాయి. మెషీన్‌గన్లు, వైమానికబాంబు దాడులతో వేలమంది ప్రాణాలు బలిగొని.. పరిస్థితి తమ అదుపులో తెచ్చుకోగలిగారు. అలా తక్షణం స్వతంత్రం కావాలన్న లక్ష్యంతో ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమం దారుణమైన అణచివేతతో అనుకున్నది సాధించకుండానే విఫలమైంది.

ఆంగ్లేయులకు అర్థమైంది!

నాయకత్వ సమస్య, సమన్వయలేమి ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. కానీ ఆ పరిణామాలతో.. ఆంగ్లేయులకు మాత్రం ఒక్క విషయం అర్థమైంది. అప్పటికే రెండో ప్రపంచయుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన వారికి ఇండియాను మరింతకాలం అదుపు చేయడం సాధ్యం కాని పని. అందుకే యుద్ధం ముగిసిన కొద్దికాలానికే మర్యాదగా అధికారం అప్పగించి... ఈ దేశం నుంచి వైదొలగాల్సి వచ్చింది.

సమాంతర సర్కార్​లు

జాతీయ స్థాయిలో ఉద్యమ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ క్విట్‌ఇండియా పోరుతో కర్షకులు ఒక బలమైన సామాజిక, రాజకీయ శక్తిగా ఆవిర్భవించారు. ప్రజా సర్కార్‌లు ఏర్పరిచి ఉనికి చాటుకున్నారు. స్థానిక రైతాంగం సమాంతర ప్రభుత్వాలను ఏర్పరచింది. ఉత్తరప్రదేశ్‌ బాలియా, ఒడిశాలో తాల్చేర్‌, మెదినీపుర్, మహారాష్ట్ర సతారాలో ప్రజా సర్కార్‌లు అని పిలుచుకునే సమాంతర ప్రభుత్వాలు ఏర్పరచగలిగారు. స్థానికంగా చోటుచేసుకున్న ఆ మార్పుల వల్లనే తెల్ల వాళ్లకు సంబంధించిన ఆస్తులపై దాడులు పెరిగాయి.

కానీ.. ఉద్యమం హింసాత్మక కావడం బ్రిటీష్ పాలకులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. తర్వాత ఉద్యమాన్ని అణిచివేయడమే కాక అమెరికా ఎంతగా ఒత్తిడి తెచ్చినా స్వాతంత్ర్యం కోసం భారతీయ నాయకుల డిమాండ్లు అంగీకరించేది లేదంటూ బ్రిటీష్ పాలకులు మొండికేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని తెగేసి చెప్పిన కారణంగా ఉద్యమం విఫలమైనా ఒక తీవ్రమైన పోరాటంగా తన ఉనికిని చాటుకుంది. ఎప్పటికైనా స్వాతంత్ర్యం ఇవ్వక తప్పదనే విషయాన్ని ఉద్యమం చాటి చెప్పింది.

ఏకతాటిపైకి

అలా... క్విట్ ఇండియా ఉద్యమం విఫలమైన పోరాటంగా మారినా దేశంలో ప్రజలమధ్య ఐక మత్యాన్ని చాటడంలో గణనీయమైన పాత్ర పోషించింది.అప్పటివరకూ వేర్వేరు వర్గాలుగా ఉన్న వారంతా ఒకే తాటిపైకి రాగలిగేలా చేసింది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి పిలుపిచ్చింది కాంగ్రెస్ పార్టీయే అయినా పార్టీతో సంబంధంలేకుండా కూడా అనేకమందిని ఉద్యమం వైపు మరల్చగలిగేలా చేసింది. బానిసత్వపు సంకెళ్లు ఇంకెన్నాళ్లంటూ తిరగబడేలా చేసింది. ఇంకో విషయం ఏంటంటే ఉద్యమం అంతర్గతంగా భారతదేశంలో విఫలమైనా బహిర్గతంగా ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ పోరాటాన్ని ప్రభావితం చేసింది.

Last Updated : Aug 8, 2021, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details