ఓ ఎన్నిక.. ఓ ఓటమి. మరో ఎన్నిక.. మరో ఓటమి.. కాంగ్రెస్ పరిస్థితి ఇది. దేశ రాజకీయాల్లో ఘన చరిత్ర ఉన్న హస్తం పార్టీలో ఓటమి పరంపర కొనసాగుతోంది. మినీ సార్వత్రికంలో.. గెలుపుపై గంపెడు ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లోనూ ఓడిపోవడం.. కాంగ్రెస ఆత్మస్థైర్యాన్ని మరింత దెబ్బ కొట్టే విషయం. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ స్థానమేంటి? పార్టీ వైఫల్యాలకు కారణాలేంటి?
ఎన్నికలకు ముందు...
ఈ సారి నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. మిగిలిన బంగాల్, కేరళ, తమిళనాడు, అసోంలో కాంగ్రెస్.. ఎన్నికలకు ముందు అధికారంలో లేదు.
ఎన్నికల తర్వాత...
బంగాల్లో ఆది నుంచి టీఎంసీ-భాజపా మధ్య నువ్వా- నేనా పోటీ నెలకొంది. అయితే ఇక్కడ వామపక్షాలు-ఐఎస్ఎఫ్తో కలిసి కూటమిగా బరిలో దిగింది కాంగ్రెస్. కింగ్ మేకర్‌గా కూటమి ఆవిర్భవిస్తుందని నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ అవేవీ ఫలించలేదు. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలు కూడా కాపాడుకోలేకపోయింది కాంగ్రెస్.
ఇదీ చూడండి:-ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకున్న పీకే
తమిళనాడులో డీఎంకేతో కలిసి బరిలో దిగింది హస్తం పార్టీ. ఈ ఒక్క రాష్ట్రంలో పొత్తు వల్ల ప్రభుత్వంలో భాగం కానుంది. అటు పుదుచ్చేరిలో ఓటమి పాలైంది.
ఈ ఎన్నికల్లో కేరళ, అసోంపై కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. నిజానికి.. కాంగ్రెస్ విజయావకాశాలు కొంత ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవే. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం సాగించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. అయిన్నప్పటికీ ఫలితం దక్కకుండా పోయింది. కేరళలో ఎల్డీఎఫ్ చారిత్రక విజయాన్ని అందుకోగా.. అసోంలో భాజపా మరింత బలంగా మారింది.