'వెళ్లొస్తాను భాయ్..' అంటూ యజమానులకు, స్నేహితులకు నిర్వేదంగా వీడ్కోలు చెబుతున్న వేలమందిలో ఒక్కటే ప్రశ్న. వెళ్తున్నాం (Migrants leaving Kashmir) కానీ మళ్లీ వచ్చేదంటూ ఉంటుందా అని. ఊరెళ్తున్నాం కానీ ఉపాధి ఉంటుందా అని. ఉగ్రదాడుల భయంతో కశ్మీర్ లోయను వీడుతున్న వలస కూలీల (Non Kashmiri Migrants) పరిస్థితి ఇది.
జమ్ము-కశ్మీర్‌లో పౌరులు, స్థానికేతరులపై జరుగుతున్న ఉగ్రదాడులతో (Attack Migrant) ప్రజలు క్షణక్షణ గండంలా గడుపుతున్నారు. ఎక్కడెక్కడినుంచో పొట్టచేతపట్టుకుని వచ్చిన వలస కూలీలు ప్రాణభయంతో కుటుంబాలతో సహా లోయను వీడి (Kashmiri Migrants) వెళ్తున్నారు. మంగళవారం వేల మంది కూలీలు శ్రీనగర్, జమ్ము, ఉధంపుర్‌లలోని రైల్వే స్టేషన్లు, బస్టాండులకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు (Kashmir Attack News) జరగకుండా పోలీసులు అక్కడ భద్రత పెంచారు. టికెట్ కౌంటర్ల వద్ద పురుషులతో పాటు మహిళలు, పిల్లలు కూడా పొడవాటి వరుసల్లో నిల్చొని గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.
4 లక్షల మంది..
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఉత్తరాఖండ్‌ల నుంచి ఏటా మార్చిలో సుమారు 4 లక్షల మంది ఉపాధి కోసం కశ్మీర్‌కు (Non Kashmiri Migrant) వెళ్తుంటారు. యాపిల్ తోటల్లో కూలీలుగా, క్రికెట్ బ్యాట్ల తయారీ, అట్టపెట్టెల పరిశ్రమలు, ఇటుక బట్టీల్లో కార్మికులుగా పనిచేస్తుంటారు. పనులు పూర్తయ్యాక నవంబరు ఆరంభంలో వీరు తమ సంపాదన చేతపట్టుకుని సంతోషంగా స్వస్థలాలకు తిరిగి వెళ్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఉగ్రదాడుల భయంతో అంతకన్నా ముందే వెళ్లిపోతున్నారు. దీనికితోడు సొంత ఊళ్లకు వెళ్లాక కడుపు నింపుకోవడమెలా అన్న ప్రశ్న వీరిని వేధిస్తోంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంకా కొందరు పనుల కోసం అక్కడి వీధుల్లో నిల్చొని ఎదురుచూస్తున్నారు.
మా నాన్నను చంపారు.. మేమెలా బతకాలి
'ఉగ్రవాదులు మా నాన్నను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారు. ఇప్పుడు మేమెలా బతకాలి' అని కన్నీటితో ప్రశ్నిస్తున్నాడు జహంగీర్ అన్సారీ. దక్షిణ కశ్మీర్‌లో శనివారం ముష్కరుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వడ్రంగి సగీర్ అన్సారీ కుమారుడు జహంగీర్. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారి కుటుంబం సగీర్ సంపాదనపైనే బతికేది. ఇప్పుడు అతడు దూరం కావడంతో వారి ఉపాధి ప్రశ్నార్థకమైంది. సగీర్ మృతదేహాన్ని తమ ఇంటికి చేర్చడానికి కూడా అధికారులు సాయం చేయలేదని, తామే కశ్మీర్‌కు వెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చిందని జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు.