Qatar Indian Navy Officers Death Penalty : ఖతార్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న 8మంది నౌకాదళ మాజీ అధికారులనువిడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. బాధిత అధికారుల కుటుంబసభ్యులను పరామర్శించిన ఆయన.. అన్ని విధాల అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ విషయాన్ని జైశంకర్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
"ఖతార్ నిర్బంధంలో ఉన్న 8 మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చినట్లు వారికి తెలియజేశాను. ఆ కుటుంబాల ఆవేదన, ఆందోళన మాకు అర్థమవుతోంది. వారి విడుదలకు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఆ కేసు వివరాలను ఎప్పటికప్పుడు బాధిత అధికారుల కుటుంబసభ్యులకు తెలియజేస్తాం"
-- ఎక్స్‌లో జైశంకర్
అసలేం జరిగిందంటే..?
Indian Navy Officers Detained In Qatar :భారత్‌కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతార్‌లోని అల్ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌కు చెందిన ఓ మాజీ వైమానిక దళం అధికారి నిర్వహిస్తున్నారు. అయితే, భారత్‌కు చెందిన ఈ 8 మందిని ఖతార్ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్‌మెరైన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని నిర్బంధించినట్లు తెలిసింది. అయితే, వీరందరికి భారత అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు బాధితులతో పాటు ఖతార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. వారిని రక్షించేందుకు ప్రయత్నించింది. చివరకు ఈ కేసు కోర్టులో విచారణకు వెళ్లగా.. తాజాగా ఎనిమిది మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది ఖతార్ న్యాయస్థానం.
దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.. ఈ కేసుపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది. నేవీ మాజీ అధికారుల కుటుంబసభ్యులతో సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది. మాజీ నేవీ అధికారులకు అన్నిరకాలుగా దౌత్యపరమైన, న్యాయపరమైన సాయం కొనసాగిస్తామని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. గోప్యతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ఈ కేసుపై ప్రస్తుతం ఎక్కువగా వ్యాఖ్యానించలేమని వివరించింది.
'జెండా ఆవిష్కరణ వద్దన్న స్థానికులు- ఎగరేసిన నౌకాదళం!'
సబ్మెరైన్ల రహస్య డేటా లీక్.. ముగ్గురు నేవీ అధికారులు అరెస్ట్!