Wife Leaves Husband For Tomato : కూరలో టమాటాలు వేసి వంటచేశాడని భర్తను విడిచిపెట్టి వెళ్లిపోయింది ఓ భార్య. ఈ ఆశ్చర్యకర ఘటన మధ్యప్రదేశ్లోని షాడోల్ జిల్లాలో జరిగింది.
ధన్‌పురికి చెందిన సందీప్ బర్మన్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో చిన్న ధాబా నడుపుతున్నాడు. నాలుగు రోజుల క్రితం తన ధాబాలో బర్మన్.. టమాటాలు వేసి కూరను వండాడు. దీంతో బర్మన్కు, అతడి భార్యకు మధ్య గొడవ జరిగింది. కిలో టమాటా రూ.140 ఉన్న సమయంలో కూరలో టమాటాఎందుకు వేశావని బర్మన్తో గొడవపెట్టుకుంది అతడి భార్య. తర్వాత మనస్తాపానికి గురై తన కుమార్తెతో కలిసి భర్తను వదిలి వెళ్లిపోయింది. ఇక చేసేదేంలేక పోలీసులను ఆశ్రయించాడు బర్మన్.
'నేను రెండు మూడు టమోటాలు వేసి కూర వండాను. కిలో టమాటా రూ.140 పలుకుతున్న సమయంలో కూరలో ఎందుకు టమాటా వేశావు అని నా భార్య గొడవపడింది. నా మీద కోపంతో నా కుమార్తెను తీసుకుని మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెను ఎలాగైనా నా వద్దకు రప్పించండి' అని ధాబా నిర్వాహకుడు సందీప్ బర్మన్ పోలీసుల వద్ద వేడుకున్నాడు. దీంతో పోలీసులకు అతడిని సముదాయించారు.
'సందీప్ బర్మన్ అనే వ్యక్తి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఫిర్యాదు చేశాడు. అతడి భార్య.. ఉమారియా జిల్లాలోని తన సోదరి ఇంటికి వెళ్లింది. ఆమెతో ఫోన్లో మాట్లాడాం. ఆమె సందీప్ బర్మన్ ఇంటికి వచ్చేందుకు అంగీకరించింది. టమాటాల విషయంలో జరిగిన గొడవ వల్లే ఆమె తన సోదరి ఇంటికి వెళ్లిపోయింది.'